తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బిజెపిని మేనేజ్ చేస్తున్నారా? లేక బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు చంద్రబాబును మేనేజ్ చేస్తున్నారా? ఇరు పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు కలిగే తీవ్ర సందేహమిది.తీరని సందేహం కూడా.ఈ రెండు మూడు రోజుల్లో కలిసిన టిడిపి నేతలు వెంకయ్య నాయుడు కారణంగానే తమ నాయకుడు అవసరమైనప్పుడు కూడా కేంద్రాన్ని విమర్శించలేకపోతున్నాడని అసంతృప్తి వెలిబుచ్చారు తెలుగుదేశం నేతలు.బిజెపి రాష్ట్ర నేత ఒకరు ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. మేము చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను తప్పిదాలను ఎండగట్టాలనుకుంటాం. అమిత్ షా కూడా అగ్రెసివ్‌గా వెళ్లమనే అంటారు. తీరా మేము కాస్త విమర్శ చేయగానే పైనుంచి తాఖీదు వచ్చేస్తుంది. తగాదా వద్దని నోటికి తాళం వేస్తారు అని ఆయన చెప్పారు. దీనికి ఏకైక కారణం వెంకయ్య నాయుడేనని ఈ వర్గం నాయకులు వాపోతున్నారు. నిజానికి ఆయన రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని చెయ్యగలిగింది చాలా తక్కువ. కాని సీనియారిటీనీ పాత సంబంధాలనూ ఉపయోగించుకుని తన స్థానం కాపాడుకోవడం తనను ఆశ్రయించుకున్నవారికి మేలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో కొసమెరుపు ఏమంటే వెంకయ్యను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడనేది వారి వాదనలో కొసమెరుపు. ఎవరు ఎవరిని చేస్తేనేం ఇద్దరూ కలిసి ఎపిలో సగం పాలనా కాలం మేనేజ్చేశారు. రెండవ శంకుస్థాపన జరిపించారు.