ఉపాసన…. ఈ పేరు గురించి, ఆమె గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లెద్దేమో? మెగా ఇంటి కోడలు ఉపాసన. ఫ్యాన్స్‌కి పరిచయమైన పేరే! చరణ్ అర్థాంగిగా ఆమెనంతా గుర్తిస్తారు.. గుర్తు పడతారు. గాసిప్ రాయుళ్లకైతే ఉపాసన ఇంకాస్త బాగా తెలుసు. ఈమధ్య కాలంలో ఏ హీరో అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోనంత గాఢంగా రామ్‌చరణ్ గురించిన వార్తలు బయటకు వచ్చాయి. చరణ్ – ఉపాసన మధ్య గొడవలు మొదలయ్యాయని, ఇద్దరూ విడాకులు తీసుకొన్నారని.. రకరకాల వార్తలొచ్చాయి. వీటిపై ఉపాసన స్పందించడం, `మేం కలిసే ఉన్నాం` అంటూ క్లారిటీ ఇవ్వడం ఇవేం ఆశ్చర్యపరిచే విషయాలు కావు. ఎవరైనా చేసేది అదే. కానీ.. ఉపాసన స్పందించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం, మాటల్లో కాన్ఫిడెన్స్ నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఉపాసన లెటెస్ట్ ఇంటర్వ్యూచూస్తే చరణ్‌కే కాదు.. ఆమెకీ అభిమానులు పుట్టుకురావడం ఖాయం.
చరణ్‌తో పెళ్లయి ఇంతకాలమైనా ఉపాసన ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. `నేను ఇదీ..` అని చెప్పుకోలేదు. కానీ ఎందుకు అనిపించిందో.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పటి వరకూ తనపై, తన ఫ్యామిలీపై, చరణ్‌తో తనకున్న విబేధాలపై వస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పి కొట్టింది. ఒక రకంగా కడిగి పారేసింది. ఉపాసన ఇంటర్వ్యూ ఆసాంతం చూస్తే ఆమెలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థం అవుతాయి. సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పడం, తడుముకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం… ఇవన్నీ కచ్చితంగా నచ్చుతాయి. ఇలాంటి ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూల్లో చరణ్ కూడా ఇంత స్పష్టంగా సమాధానాలు ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఆఖరికి తన ఆకారం గురించి వికారంగా మాట్లాడిన వాళ్లందరికీ చెంప చెళ్లుమనేలా సమాధానాలు ఇచ్చి ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా ఉపాసన తన ఫిజిన్కి కంట్రోల్లో తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతోంది. ఆ మార్పు ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి నాటి ఉపాసనకీ, ఇప్పటికీ ఎంత తేడా?? ఉపాసన గురించి ఎన్ని గాసిప్పులు వినిపించాయో.. అన్ని మంచి మాటలూ బయటకు వచ్చేవి. ఉపాసన ఉదార స్వభావం గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. అపోలో హాస్పిటల్స్ తరపునుంచి తాను చేద్దామనుకొంటున్న కార్యక్రమాలు, తన లక్ష్యం.. ఇవన్నీ వింటుంటే ముచ్చటేస్తుంది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉపాసనకు ఎందుకొచ్చిందో? దీని వెనుక ఎవరు ఉన్నారో అనవసరం గానీ.. ఉపాసన ఇచ్చిన క్లారిటీతో చాలామంది నోళ్లు మూతబడడం ఖాయం.