మనకున్న సెన్సిబుల్ డైరెక్టర్లలో క్రిష్ ఒకడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె….. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి. ఇలా సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకొంటూ పోతున్నాడు. గత సినిమాల కమర్షియల్ రిజల్ట్‌ని పక్కన పెడితే… `ఇదేంటి?? క్రిష్ ఇంత వరస్ట్ సినిమా తీశాడు` అని ఎప్పుడూ ఎవ్వరూ అనుకోలేదు. కనీసం `ఈ సినిమా బాలేదు` అనిపించుకోలేదు. దానికి కారణం బలమైన కథ, శక్తిమంతమైన పాత్రలు, గుర్తుండిపోయే సన్నివేశాలతో సినిమాలు తీయడమే. అందుకే క్రిష్ సినిమా ఎప్పుడూ తప్పు చేయలేదు. కాకపోతే ఆర్థిక పరమైన లాభాల్ని అందివ్వలేదంతే. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసింది. విడుదలకు ముందే క్రిష్‌కి లాభాల్ని అందించింది. దాంతో క్రిష్ ఫేట్ మారబోతోందిప్పుడు.
క్రిష్ ఎప్పుడూ ఓ విలువలున్న కథతో సినిమాలు తీస్తాడన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కాకపోతే సినిమా విషయానికొచ్చేసరికి అంతిమ ఫలితం ఆర్థిక లావాదేవీలపైనే ఆధారపడి ఉంటుంది. దాన్ని దాటుకురాలేని క్రిష్.. పెద్ద హీరోల్ని పెద్దగా ఆకర్షించలేకపోయాడనే చెప్పాలి. క్రిష్ దమ్ము, తెగువ, టాలెంట్ తెలిసి కూడా ప్రయోగాలు చేయడానికి భయపడే బడా హీరోలు క్రిష్‌కి దూరంగా ఉండేవారు. గౌతమి పుత్రతో క్రిష్‌పై ఉన్న అపనమ్మకాలన్నీ తొలగిపోతున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చరిత్ర విద్యార్థులకు తప్ప పెద్దగా తెలీదు. అయితే `ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే` అనే రీతిలో… హైప్ క్రియేట్ చేయడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఇదే.. పరిశ్రమని ఆకర్షిస్తోంది. దాంతో పెద్ద హీరోలు క్రిష్‌తో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి క్రిష్‌కి ఫోన్ వెళ్లిందని, ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడైనా రావొచ్చని టాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి.
రామ్‌చరణ్ – క్రిష్ కాంబోలో సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలోనే చరణ్‌తో క్రిష్ పనిచేయాల్సింది. కానీ.. కుదర్లేదు. ఈసారి మాత్రం ఈ కాంబోని సెట్ చేయడానికి అశ్వనీదత్ వీర లెవిల్లో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ కోసం శివం అనే కథ రెడీ చేశాడు క్రిష్. గౌతమి పుత్ర హిట్టయితే మరోసారి శివం ప్రాజెక్టు చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్వయంగా బాలకృష్ణనే మరోసారి క్రిష్‌తో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అలా… క్రిష్ ఈ ఒక్క సినిమాతో.. స్టార్ హీరోల దృష్టిలో పడిపోయాడు. ఇప్పుడు ఈ టాక్స్ అన్నీ నిజం కావాలంటే.. గౌతమి పుత్ర హిట్ అవ్వాల్సిందే. అదే జరిగితే… క్రిష్ పంట పండినట్టే.