సింహా టైమ్ లో నాకు అన్యాయం జరిగిందంటూ… ఈమధ్య కొరటాల శివ నోరెత్తాడు. దాంతో అందరి వేళ్లూ, కళ్లూ బోయపాటి శ్రీను వైపుకు చూశాయి. సింహాకి కొరటాల పనిచేసిన మాట వాస్తవం.. టైటిల్ కార్డులో కొరటాల శివ పేరు లేకపోవడం కూడా అంతే నిజం. అయితే ఈమధ్య చాలా కథ జరిగింది. బోయాపాటికీ కొరటాలకూ మధ్య చాలా ఇష్యూస్ నడిచాయి. వాటి గురించే.. చాలామందికి తెలీదు.
సింహా చిత్రానికి కథ వండడంలో భాగంగా కూర్చున్న రచయితల్లో కొరటాల శివ కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం దాదాపు నెల రోజులు వర్క్ చేశాడు కొరటాల. అయితే.. కొరటాల ఇచ్చిన ఇన్పుట్స్ అంతంత మాత్రమే. కథ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ అవ్వని పక్షంలో `టైటిల్ కార్డ్స్‌లో ఎవరి పేరు వేస్తారు?` అనే డిస్కర్షన్ మొదలైందట. నిజానికి ఈ సినిమాకి కొరటాల ఒక్కడే కాదు.. చాలామంది రచయితల హ్యాండ్ ఉంది. అందుకే కథ, రచనా సహకారం, మాటలు.. వీటి పంపకాల విషయంలో క్లారిటీ మిస్సయ్యింది. `నా పేరు వేయాలంటే.. నా పేరు వేయాలి` అంటూ ఆ గ్రూప్ మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైందట. అయితే కొరటాల మాత్రం `నా పేరు వేయాల్సిందే` అని పట్టుపట్టాడట.
`ఈ సినిమా కోసం చాలామంది పనిచేశారు. బేసిక్ ఐడియా నాదే. కాబట్టి ఒకరి పేరంటూ ప్రత్యేకంగా వేయను` అని బోయపాటి క్లారిటీగా చెప్పేశాడట. దాంతో కొరటాల శివ అలిగి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో `సింహా` సినిమాకి పనిచేసినందుకు గానూ తనకు రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట కొరటాల. బోయపాటి రూ.1.5 లక్షల చొప్పున మూడు చెక్కులు ఇచ్చి రెండు నెలల్లో రూ.6 లక్షల వరకూ క్లియర్ చేశాడట. అలా.. సింహా తాలుకూ పారితోషికం కొరటాలకు అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడి నుంచీ బోయపాటికీ, కొరటాలకూ మధ్య గ్యాప్ మొదలైంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. బృందావనం సినిమాకీ అదే రీతిన కష్టపడిన కొరటాల పనితనాన్ని దగ్గరుండి చూసిందీ, గమనించిందీ.. ఎన్టీఆర్! ఆ సినిమాతో కొరటాల పేరు పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. అదే.. మిర్చి సినిమా ఛాన్స్ తీసుకొచ్చింది. ఆ తరవాత కొరటాల కథ అందరికీ తెలిసిందే.
ఇదీ… కొరటాల – బోయపాటి మధ్య జరిగిన టైటిల్ కార్డ్ వార్! దీని గురించే జనం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.