దీపావళి సంబరాలు ఓరోజు ముందే మొదలైపోయాయి సినీ అభిమానులకు. ఈ దీపావళికి బాక్సాఫీసు దగ్గరకు స్టార్ల సినిమాలేం రాలేదు. అయితే… ఫస్ట్ లుక్లతో మాత్రం పండగ సంబరాల్ని రెట్టింపు చేసే పనిలో పడ్డారు మన హీరోలు. వెంకటేష్ గురు కొత్త పోస్టర్ ఈరోజే బయటకు వచ్చేసింది. రామ్ చరణ్ నిన్నే ఓ కొత్త స్టిల్ విడుదల చేశాడు. మంచు మనోజ్ గుంటూరోడు లుక్ కూడా బయటకొచ్చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా.. సంక్రాంతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లుక్స్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. బాలయ్య నటిస్తున్న 100వ సినిమా.. గౌతమి పుత్ర శాతకర్ణి. ఇందులోని ఓ లుక్ దీపావళి సందర్భంగా విడుదల చేశారు. యుద్ద భూమిలో.. బాలయ్య విశ్వరూపం చూపిస్తున్న స్టిల్ అది. విశ్రాంతి లేదు.. విరామం లేదు.. అంటూ బాలయ్య కత్తితో శత్రు సంహారం చేస్తున్నట్టున్న ఈ పోజ్… బాలయ్య అభిమానులకు తెగ నచ్చేయడం ఖాయం.
ఇక చిరంజీవి కూడా తన స్టైల్ చూపించేశాడు. చిరు నటిస్తున్న 150వ చిత్రం.. ఖైదీ నెం.150. ఈ సినిమాలోని చిరు లుక్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని చిత్రబృందం ముందే చెప్పింది. అన్నట్టుగానే దీపావళికి ఒకరోజు ముందే… ఖైదీ నెం.150లో చిరు లుక్‌ని బయటపెట్టింది. చిరు జోరుగా స్టెప్ వేస్తూ.. తనలో స్పీడ్ తగ్గలేదని నిరూపిస్తూ ఇచ్చిన పోజ్ అది. మెగా అభిమానుల్ని కేక పెట్టించేలానే ఉంది. మొత్తానికి తమ లేటెస్ట్ లుక్స్‌తో అభిమానుల్ని మురిపించారు ఈ స్టార్ హీరోలు. మరి బాక్సాఫీసుని గెలిచేదెవరో చూడాలి.