ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర సిసలైన సమరం చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు. దశాబ్దాలుగా ‘నువ్వా, నేనా’ అంటూ పోటీ పడిన ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాల్నిరిలీజ్ చేస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి జనవరి 12న విడుదల చేయడానికి సమాయాత్తం అవుతోంటే, చిరంజీవి ఖైదీ నెం.150 13న విడుదల కానుంది. అయితే.. బయ్యర్లు ఇప్పుడు ఖైదీ నెం.150పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బాలయ్య సినిమా కంటే కనీసం ఒక రోజు ముందు చిరు సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని సలహాలిస్తున్నారు. అంటే.. జనవరి 11నే ఖైదీ నెం.150 రావొచ్చన్నమాట. అయితే.. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఆలోచిస్తోందట. చిరంజీవి సినిమా ఎప్పుడొస్తే.. అదే రోజు తమ సినిమాని విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఖైదీ నెం.150 ఓ రోజు ముందుగా జనవరి 11న విడుదలైతే.. అదే రోజున గౌతమి పుత్ర విడుదల అవుతుందన్నమాట.
చిరు, బాలయ్యల పోటీ ఇప్పటిది కాదు. వాళ్ల సినిమాలు చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే దాదాపుగా ప్రతీసారీ…. చిరుపై బాలయ్యదే పై చేయి అయ్యింది. ఇప్పుడూ అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని గౌతమి పుత్ర టీమ్ భావిస్తోందట. ఒకవేళ చిరు సినిమా రిలీజ్ డేట్ మారితే.. తమ సినిమానీ ముందుకు తీసుకురావాలని క్రిష్ అండ్ టీమ్ అనుకొంటోంది. సో.. చిరు, బాలయ్యలు ఒకేరోజున ఢీ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.