తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గంలో పెను మార్పులు జరగబోతున్నాయి. 31 జిల్లాల కమిటీల ద్వారా పెద్ద సంఖ్య నాయకులకు పదవులు లభించబోతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. ఈసారి బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తూ పదవుల పందేరం జరగబోతోంది.
పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కీలకమైన పొలిట్ బ్యూరోను పునర్ వ్యవస్థీకరిస్తారని సమాచారం. పూర్తిస్థాయిలో పార్టీకి కొత్త రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. మరో రెండున్నర సంవత్సరాల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రకటించే రాష్ట్ర, జిల్లా కమిటీలే 2019 ఎన్నికల్లో కీలక పాత్రను పోషించాల్సి ఉంటుంది. కాబట్టి సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీల ఎంపిక జరుగుతుంది.
రాష్ట్రంలోని 31 జిల్లాలకు అధ్యక్షులు ఎవరనేదానిపై కేసీఆర్ దాదాపుగా అవగాహనకు వచ్చారట. కనీసం 10 జిల్లాల అధ్యక్షులుగా బీసీ నేతలను నియమిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద కనీసం 51 శాతం పదవులను ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాలనేది కేసీఆర్ ఉద్దేశంగా చెప్తున్నారు. మంత్రివర్గంలో మహిళలకు ఇంత వరకూ చోటు దక్కలేదు. పార్టీ పదవుల్లో మాత్రం వాళ్లకు సముచిత ప్రాధాన్యం ఉంటుందట.
జిల్లాల విషయానికి వస్తే పెద్ద జిల్లా కమిటీల్లో గరిష్టంగా 24 మంది ఉంటారట. చిన్న జిల్లాల కమిటీల్లో 15 మంది వరకూ ఉంటారని సమాచారం. మొత్తం మీద దాదాపు 3,500 మందికి పార్టీ పదవులు దక్కబోతున్నాయి. జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల చాలా మంది నాయకులకు పదవులు లభించే అవకాశం ఉంది.