నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకొంటోంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆడియో ఫంక్షన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనుంది. ఈ సినిమా స్పెషల్ షో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఒకేసారి ప్రదర్శించనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైపోయినట్టు సమాచారం. 2017 జనవరి 3వ తేదీన కేసీఆర్, చంద్రబాబులకు గౌతమి పుత్ర శాతకర్ణిని ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో వ్యవహారం కాబట్టి.. వాళ్ల అపాయింట్ మెంట్లు ముందే ఫిక్సయిపోతాయి కాబట్టి… వాళ్ల డేట్ లాక్ చేసుకోవడానికి ముందుగానే ఈ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
బాలకష్ణ స్వయంగా ముహూర్తం చూసి.. జనవరి 3వ తేదీన స్పెషల్ షో ఏర్పాటు చేయాలని ఫిక్సయ్యాడని టాక్. వీలుంటే ఇద్దరు సీఎంలకు ఒకేసారి, లేదంటే వేర్వేరుగా షోలు వేస్తారట. వీలైనంత వరకూ ఇద్దరికీ ఒకేసారి సినిమా చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షో ఎప్పుడు పడాలి, ఆడియో ఏ సమయానికి రిలీజ్ చేయాలి అనేది కూడా బాలయ్య ముందే ముహూర్తం ఫిక్స్ చేసి పెట్టుకొన్నట్టు, అవన్నీ… ఆయన అనుకొన్న ప్రకారమే జరిపించాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆడియో ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. ఆడియో ఫంక్షన్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఓ చోట నిర్వహించి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నార్ట.