ఆరెస్సెస్ ఎన్నడూ దేశం కోసం పోరాడలేదు సరికదా, స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిషోళ్ల తొత్తుగా వ్యవహరించింది. అలాంటి ఆరెస్సెస్ నేతలు కాంగ్రెస్ గురించి, దేశ తొలి ప్రధాని నెహ్రూ గురించి మాట్లాడటమా? అని ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి. నెహ్రూపై విమర్శలు చేస్తూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పొగడటాన్ని కుత్సిత రాజకీయ బుద్ధికి నిదర్శనంగా అభివర్ణించిన ఆయన… ఆరెస్సెస్, బీజేపీ లకు పటేల్ పై ప్రేమాభిమానాలేమీ లేవని, నెహ్రూను నిందించడానికే ఆయన పేరును వాడుకుంటున్నారని అన్నారు.
గాంధీభవన్ లో మాట్లాడిన జైపాల్… ఈ సందర్భంగా ఆరెస్సెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.. నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని, వారంతా చరిత్ర తెలియకుండా మాట్లాడారని అన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ, స్వాతంత్రానంతరం దేశాన్ని నడపడంలోనూ నెహ్రూ, పటేల్ ఇద్దరూ సమ ఉజ్జీలుగానే పనిచేశారని, ఆ సమయంలో నిర్ణయం తీసుకున్నా కేబినెట్ లో చర్చించిన తర్వాతే తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాటి కేబినెట్ లో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, జయప్రకాశ్ నారాయణ, శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని జైపాల్ గుర్తు చేశారు. అలాగే మహాత్మాగాంధీకి కూడా వీరిద్దరూ ప్రియ శిష్యులని, క్విట్ ఇండియా సమయంలో “డూ ఆర్ డై” పేరుతో ఉద్యమం చేపడితే కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఉద్యమించగా, ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై కూడా జైపాల్ విమర్శనస్త్రాలు ఎక్కుపెట్టారు. గుజరాత్ లో గల్లీ లీడర్ అయిన అమిత్ షాకు, దేశ చరిత్ర ఏంతెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు దేశం కోసం పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారు.. కానీ, ఆరెస్సెస్ ఎన్నడూ దేశం కోసం పోరాడిందీ లేదు, ఆ సంస్థ నాయకులు స్వాతంత్య్రం కోసం జైలుకు పోయిందీ లేదు.. అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక అర్హత లేదు అని జైపాల్ స్పష్టం చేశారు!!