ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రసారాల నియమాలను ఉల్లంఘించడమే ఈ నిలిపివేతకు కారణమని.. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి సమయంలో ప్రోగ్రాం కోడ్ ను ఉల్లఘించి కీలక ప్రదేశాలను ప్రసారం చేసిందని ప్రభుత్వం తరుపు పెద్దలు ప్రకటించారు! ఇదే విషయాలపై తాజాగా స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు… దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో కఠినంగా ఉన్నామని, ప్రసార నిబంధనలను ఉల్లంఘించినందుకే ఎన్డీటీవీ ఛానల్ పై నిషేధం విధించామని పునరుద్ఘాటించారు కూడా! అయితే ఇదే క్రమంలో మరో రెండు చానల్ పై నిషేదం విదిస్తూ సమాచార ప్రసారాల శాఖ ఆదేశాలు జారీచేసింది.
“ఎన్డీటీవీ ఇండియా” చానల్ పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్న తరుణంలో తాజాగా మరో రెండు చానళ్లపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదనే కారణంతో “న్యూస్ టైం అస్సాం” చానల్ ప్రసారాలను నిలిపేస్తున్నారు. యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని చెబుతున్నారు. ఈ ఆదేశాల ప్రకారం నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్ 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపేయనున్నారు. ఇదే క్రమంలో అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను ఏకంగా వారం రోజులపాటు నిషేధించారు!