కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మరోసారి ఇరుకున పడ్డారు! సొంత పార్టీ నేతలే మళ్లీ ఆయనపై గుర్రుగా ఉన్నారు. తెరాస సర్కారుపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే… ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడుతూ ఆ పోరాటాలకి తూట్లు పొడుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలు పథకం గురించి జానారెడ్డి మాట్లాడారు. ఈ పథకం పనులను కేసీఆర్ సర్కారు ఎంతో చురుగ్గా చేస్తోందనీ, ఈ విషయంలో కేసీఆర్ను మెచ్చుకోవచ్చంటూ ఆయన సర్టిఫై చేశారు! అంతే, అక్కడి నుంచి జానారెడ్డిపై టి. కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన స్వపక్షంలోనే విపక్ష నేతగా మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే జానా వ్యవహారంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ పంచాయితీ ఉంటుందనీ, జానా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది పార్టీ వర్గాలు చెబుతున్నారు.
కొద్ది నెలల కిందట కూడా ఇలాంటి పరిస్థితిలోనే జానా ఇరుక్కున్నారు. కేసీఆర్ సర్కారుకు మద్దతు పలుకుతూ ఆయన చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేతలు ఆయన ఎదుటే మండిపడ్డ సందర్భం కూడా వచ్చింది. అంతేకాదు, ‘జానారెడ్డి కేసీఆర్ కోవర్టు’ అనే స్థాయి విమర్శలు కూడా ఆపార్టీకి చెందిన సీనియర్ నేతలే గతంలో చేశారు. ఇలాంటి పంచాయితీలు ఒకట్రెండుసార్లు జరిగాయి. ఆ అనుభవం ఉండి కూడా మరోసారి తెరాస సర్కారు చేపడుతున్న పనులను జానా మెచ్చుకుంటే ఎలా..? ఆ వార్తలు మీడియాలో ప్రముఖం వచ్చాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్లో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో అర్థంకాని సందిగ్ధత పార్టీ క్యాడర్లో ఉన్నమాట వాస్తవం.
ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతీసారీ జానారెడ్డి స్పందించిన తీరు ఒకేలా ఉంటోంది! ఇప్పుడు కూడా అంతకంటే భిన్నంగా ఉంటుందని కూడా ఆ పార్టీ వర్గాలే అనుకోవడం లేదు. తనపై కావాలనే కొంతమంది నేతలు కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారనీ, తనపై విమర్శలకు గాంధీభవన్ వేదికగా మారుతోందనీ, చివరికి బిచ్చగాళ్లు కూడా తనకు బుద్ధులు చెబుతున్నారనీ, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తనకు వైరాగ్య భావన కలుగుతోందని గతంలో జానారెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా ఇలానే స్పందిస్తారేమో! అయినా, ఓపక్క కాంగ్రెస్-తెరాసల మధ్య రాజకీయ వైరం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు… సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డికి ఏ కామెంట్ ఎలా పరిణమిస్తుందో తెలీదా.. అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు! అధిష్ఠానం ఆయనకి బుద్ధి చెబితేతప్ప మారేలా లేరంటున్నారు! తాజా ఫిర్యాదుల నేపథ్యంలో అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందో మరి!