ఇప్పటికే ప్రముఖ వార్తా ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝుళిసిస్తున్న సంగతి తెలిసిందే. ప్రసార నియమాల ఉల్లంఘనకు పాల్పడిన జాతీయ ఛానెల్ ఎన్డీటీవీ ప్రసారాలపై ఒకరోజు నిషేధం విధించారు! మరి కొన్ని ఛానెల్స్‌పై కూడా ఇదే విధంగా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా పరిమితుల గురించి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉర్దూ పాత్రికేయుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కళలకు హద్దులు ఉండవన్నారు, కానీ దేశానికి సరిహద్దులు ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలని వెంకయ్య చెప్పారు. మీడియా స్వేచ్ఛ అనేది దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదన్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన విధంగా మీడియా ప్రసారాలు ఉండాలని వెంకయ్య చెప్పారు. ఈ పరిమితులను మీరి ఎవరైనా వ్యవహరిస్తే నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. న్యూస్‌లో వ్యూస్ ఉండకూడదనీ, వార్తల్ని కేవలం వార్తల్లా మాత్రమే ప్రెజెంట్ చేయాలని, సొంత అభిప్రాయాల కలబోత తగ్గాలని అన్నారు. అలాంటి అభిప్రాయాలు ఏవైనా ఉంటే, వాటిని వ్యక్తీకరించేందుకు ఎడిటోరియల్ పేజీలను ఉపయోగించుకోవాలని వెంకయ్య సూచించారు. కేంద్రం మీడియా స్వేచ్ఛకు కట్టబడి ఉంటుందనీ, దేశ పౌరుడు ముఖ్యం, ఆ తరువాతే మీడియా అని అన్నారు!
సో.. మీడియా కథనాల విషయంలో కేంద్రం కటువుగానే వ్యవహరిస్తుందని అర్థమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఏపీలో ప్రతిపక్షం పోరాటం చేస్తోంది కదా! ప్యాకేజీ కంటే హోదా గొప్పదని కాదని కేంద్రం చెబుతున్నా వెనక్కి తగ్గడం లేదు కదా. పైగా, వారి మీడియాలో ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ బోలెడన్ని కథనాలు వేస్తున్నారు. అవి కేంద్ర వైఖరికి విరుద్ధంగా ఉన్నాయని భావించి, విస్తృత ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని నిర్ధరించి సదరు మీడియా సంస్థపై కూడా కేంద్రం ఉరిమే ప్రమాదం ఉందేమో అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు..! రాష్ట్రంలో అధికార పార్టీకి కూడా ఆ మీడియా సంస్థ కొరకరాని కొయ్యగా మారింది కదా! పైగా, మీడియా స్వచ్ఛకి తెలుగుదేశం కూడా ఎంతగా కట్టుబడి ఉంటుందో అందరూ చూస్తున్నదే. ఏలికలకు నచ్చే కథనాలు వెయ్యకపోతే ఏరిపారేస్తాం అనే సందేశాన్ని ఇచ్చిన సందర్భాలను కూడా మనం చూడాల్సి వచ్చింది కదా!