కామెడీ వేషాలేసి, నవ్విస్తూ, నాలుగు రాళ్లు వెనకేసుకొన్న సప్తగిరి ఇప్పుడు హీరో అవతారం ఎత్తాడు.. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవికిరణ్ నిర్మాత. పాటలు, ట్రైలర్ బయటకు వచ్చేశాయి. నిమిషం న్నర సాగిన ట్రైలర్లో సప్తగిరి కామెడీ కంటే, హీరోగా బిల్డప్ ఇచ్చిన షాట్సే ఎక్కువ కనిపించాయి. నేనూ డాన్సులు చేయగలను, నేనూ ఫైటింగులు జంపింగులు చేయగలను అని నిరూపించుకోవాలన్న తపనే ఎక్కువ కనిపించింది. అబ్బ తమ్ముడూ చంపేశావ్.. ఎంట్రీ ఇరగ్గొట్టేశావ్ అంటూ బ్యాక్ గ్రౌండ్లో కేకలు, విజుల్సూ వినిపించారు. అంతకు మించిన మేటర్ కనిపించలేదు. వీటి మధ్యన షకలక శంకర్ వేసిన డైలాగ్సే కాస్తో కూస్తో పేలాయి. అయితే టేకింగు, సెటప్పులూ, క్వాలిటీ ఇవ్వన్నీ బడా సినిమాల స్థాయిలోనే కనిపించాయి.
సప్తగిరి లాంటి కమెడియన్ హీరోగా సినిమా అంటే జనాలు ఫైట్లూ, డాన్సులు ఆశించరు. ఇంకాస్త కామెడీ తప్ప. అది ట్రైలర్లో చూపించలేకపోయాడు సప్తగిరి. ట్రైలర్లో జోకులన్నీ పేల్చేస్తే ఇక సినిమాల్లో ఏం చూపించలేం అని దాచేసుకొన్నారేమో. అయితే ఇది ఓ తమిళ సినిమాకి రీమేక్. దాన్ని తెలుగీకరించి డైలాగులు కూడా తనే రాసుకొన్నాడు సప్తగిరి. ఈ సినిమా చూసినవాళ్లు, తీసినవాళ్లు కాన్ఫిడెన్స్గానే ఉన్నారు. సినిమా విడుదలైన తరవాత కూడా ఈ నమ్మకం ఇలానే ఉంటే, సప్తగిరికి హీరోగా ఇంకో సినిమా వస్తుంది. లేదంటే.. అంతే సంగతులు.