మూడంటే మూడు కోట్లతో వారం రోజుల్లో సినిమా చుట్టేసి జనం మీదకు వదలగల ఘనుడు రాంగోపాల్ వర్మ. అసలు ఎప్పుడు ఆలోచిస్తాడో, ఎప్పుడు స్క్రిప్టు రాస్తాడో, ఎప్పుడు సినిమా పూర్తి చేస్తాడో తెలీదు. కానీ… నెలకో సినిమా వచ్చేస్తుంటుంది. సినిమాని తక్కువ బడ్జెట్లో చుట్టేసినా వర్మ తాలుకూ స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గవు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఓ సినిమాకు రూ.340 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాడు. ఆ సినిమా పేరే న్యూక్లియర్. ఇదో హాలీవుడ్ మూవీ. వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రమిదే. ఈ విషయాన్ని వర్మ కూడా ధృవీకరించాడు. ఇక మీదట యుద్దాలంటూ జరిగితే…. న్యూక్లియర్ బాంబులనే ఆయుధాలుగా చేసుకొంటారని, హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు దాడి జరిగితే వందేళ్లకు కూడా అది తేరుకోలేదని, ఇక మీదట న్యూ క్లియర్ బాంబు వాడితే.. ప్రపంచ పటంలోనే ఆ దేశం కనిపించదని.. వర్మ హెచ్చరిస్తూ తీస్తున్న సినిమా ఇది. భారతదేశంతో పాటు అమెరికా, చైనా, రష్యాలలో ఈ సినిమాని చిత్రీకరిస్తారట. రూ.340 కోట్ల బడ్జెట్ కాబట్టి, మన దేశంలో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కే చిత్రం ఇదే అవుతోందని చిత్రబృందం చెబుతోంది. ఇదీ… న్యూక్లియర్ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.
అయితే వర్మ పై అన్ని కోట్లు పెట్టుబడి పెట్టగల నిర్మాత ఎవరబ్బా?? అనే ఆరాలు మొదలైపోయాయి. సీఎమ్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వర్మ మాత్రమే ఇలాంటి సబ్జెక్ట్ తెరకెక్కించగలడని నమ్మి… వాళ్లే వెదుక్కొంటూ వర్మ దగ్గరకు వచ్చారని ముంబై వర్గాలు చెబుతున్నాయి. తెలుగునాట వర్మ ప్రతిష్ట చతికిల పడి చాలా కాలమైంది. అందుకే బాలీవుడ్ వెళ్లి.. సర్కార్ 3 తీసుకొంటున్నాడు. ఈ దశలో రూ.340 కోట్లతో వర్మ ఓ సినిమా పట్టాడంటే.. గ్రేటే! అయితే ఇదంతా వర్మ పబ్లిసిటీ కోసం వాడుకొంటున్న `వార్త`.. లేదంటే నిజంగానే ఈ సినిమా పట్టాలెక్కుతోందా? అనేది తెలియాల్సివుంది.