తెలంగాణలో ఆగమేఘాల మీద జిల్లాల సంఖ్యను మూడు రెట్లు పెంచేశారు. రెవిన్యూ డివిజన్లు, మండలాల సంఖ్యనూ పెంచారు. రాష్ట్రమంతటా సంబరాలు జరిగాయి. కేసీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకాలు జరిగాయి. వీధుల్లో పటాకులు కాల్చారు. పండగ చేసుకున్నారు. అందువల్ల ప్రజలకు ఏం ఒరిగిందో గానీ రైతులకు మాత్రం బీమా ధీమా అందడంలో అదే అడ్డంకిగా మారింది. దీనిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టినట్టు లేదు.
రైతులు యాసంగిగా పిలిచే రబీ సీజన్ మొదలై నెల గడిచిపోయింది. పంటల బీమాకు సంబంధించిన రాతకోతలు మాత్రం ఇంకా మొదలుకాలేదు. ఏ జిల్లాలో ఏపంటకు ఎంత ప్రీమియం వసూలు చేయాలి, ఏ జిల్లాలో ఏ కంపెనీ ద్వారా పంటల బీమా అమలు చేయాలనేది ఇంకా ఖరారు కాలేదు. సాధారణంగా సీజన్ మొదలయ్యే నాటికి ఈ వివరాలను వెల్లడించాలి. కానీ కొత్త జిల్లాల సంబరంలో ఉన్న ప్రభుత్వం ఈ పాత విషయాన్ని విస్మరించింది.
అనుకోని కారణాల వల్ల పంట దెబ్బతింటే రైతును ఆదుకునేది పంటల బీమానే.
బీమా ఉందనే ధీమాయే రైతులకు ఎంతో భరోసానిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన మంత్రి పంటల బీమాను అమలు చేస్తోంది. అది కాకుండా వాతావరణ ఆధారిత పంటల బీమా అమల్లో ఉంది. ఏ బీమాకైనా జిల్లాల వారీగా మార్గదర్శకాలు అవసరం. ప్రస్తుతం కొన్ని బీమా కంపెనీల వ్యవహార శైలి ఆశ్చర్యంగా ఉంది. పాత జిల్లాల్లో పంటలవారీగా బీమా ప్రీమియం విషయంలో తక్కువ కోట్ చేసిన కంపెనీలు ఇప్పుడు ఎక్కువ కోట్ చేసినట్టు సమాచారం.
అసలే పంట రుణ మాఫీ అనుకున్నంత ప్రయోజనం కలిగించడం లేదు. ఒకేసారి మాఫీ చేసి ఉంటే రైతులకు గొప్ప మేలు జరిగేది. విడతల వారీ మాఫీతో చాలా మంది రైతులకు కొత్త రుణాలు పుట్టక ప్రయివేట్ వడ్డీ వ్యాపారులే దిక్కయిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు ఉదాహరణలతో సహా వెల్లడించాయి.
కనీసం పంటల బీమా అయినా ధీమా ఇస్తుందని రైతులు ఆశిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టకపోతే పుణ్య కాలం కాస్తా గడిచిపోవచ్చు. రబీ సీజన్ ముగియకముందే మార్గదర్శకాలను రూపొందిస్తే రైతుకు మేలు.