ఈమధ్య స్టార్ ప్రొడ్యూసర్లు ప్రమోషన్లు కొట్టేస్తున్నారు. మొన్నే దిల్ రాజు తాతగా మారాడు. ఇప్పుడు మరో బడా ప్రొడ్యూసర్ కూడా తాతయ్య అయిపోయారు. ఆయనే అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై పలు హిట్ సినిమాల్ని అందించారు అశ్వనీదత్. ఆయన ఖాతాలో మెగా బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. గత కొంతకాలంగా సినీ నిర్మాణంలో స్పీడు తగ్గించారు. ఇప్పుడు తన అల్లుడు నాగ అశ్విన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా.. తాతయ్య అయిపోయారు. అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకా దత్.. సినీ దర్శకుడు నాగ అశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం ఫేమ్)ని ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పుడు ఓ మగబిడ్డ పుట్టాడు. కొంత సేపటి క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రియంకా దత్ మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో దత్ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. నాగ అశ్విన్ ఇప్పుడు ‘మహానటి’ పేరుతో సావిత్రి జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. సావిత్రి పాత్రలో నిత్యమీనన్ నటించనుంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.