సంగీత దర్శకులు దర్శకులు కావడం, హీరోలుగా మారడం మన తెలుగులో బాగా తక్కువ. తమిళ తంబీలకు బాగా చెల్లుబాటు అయిన విషయం. తెలుగులో సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టరుగా మాంచి పేరు, క్రేజూ సంపాదించుకొన్న దేవీశ్రీ ప్రసాద్… హీరోగా అడుగులు వేయడానికి యేళ్ల తరబడి తటపటాయిస్తున్నాడంటే ఇక్కడి ప్రేక్షకుల ఆలోచనా ధోరణులు, మార్కెట్లు ఎలా ఉంటాయో ఓసారి అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఇవేం పట్టించుకోకుండా ఆర్పీ పట్నాయక్ అనుకొన్నదే తడవుగా రంగంలోకి దూకేశాడు. ఆర్పీపట్నాయక్ పేరు ఓదశలో మారుమోగిపోయింది. తెలుగునాట మణిశర్మ, వందే మాతరం, కీరవాణి, చక్రి వీళ్లందరికీ…. ఆర్పీ రాక ఓ కుదుపులా తగిలింది. వరుసగా సూపర్ డూపర్ హిట్లతో చెలరేగిపోయాడు.
ఆర్పీ మ్యూజిక్ ఇస్తే చాలు… ఆడియో హిట్ అనుకొనేవాళ్లంతా. సరిగ్గా.. ఆర్పీ దృష్టి నటనపై మళ్లింది. శ్రీను వాసంతీ లక్ష్మితో నటుడైపోయాడు. ఆ సినిమాలో చాలా క్లిష్టమైన గుడ్డివాడి పాత్రలో కనిపించాడు ఆర్పీ. ‘నటుడిగా జస్ట్ ఓకే’ అనిఇపంచుకొన్నాడంతే. అయితే.. అది సరిపోలేదనుకొన్నాడేమో.. వెంటనే తన దృష్టిని మెగాఫోన్ వైపుకి మళ్లించాడు. `అందమైన మనసులో` అనే ఓ లవ్ స్టోరీ తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కడి నుంచి వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బ్రోకర్ ఓకే అనిపించినా డబ్బులు రాలేదు. తులసీదళం బెడసి కొట్టింది. ఫ్రెండ్స్ బుక్ తుక్కయిపోయింది. ఇప్పుడు మనలో ఒకడు అనే పేరుతో ఓ సినిమా తీశాడు. దీనికి కూడా కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఈ సినిమా కూడా ఫట్ మంది.
కథాంశాల దగ్గర ఆర్పీ తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే ప్రధాన పాత్రలో ఆర్పీని ఎందుకనో జనం రిసీవ్ చేసుకోడం లేదేమో అనిపిస్తోంది. మనలో ఒకడు లాంటి సబ్జెక్ట్ మరో సీరియర్ నటుడెవరైనా చేసుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కేవలం నటనపై మోజు, ప్రధాన పాత్ర తనే పోషించాలన్న ఆలోచన ఉండడం వల్ల.. కొన్ని మంచి కథలు కూడా జనానికి రీచ్ అవ్వడం లేదన్నది విశ్లేషకుల మాట. పోనీ ఆర్పీ ఏమైనా ఆయా పాత్రల్లో అత్యద్భుతంగా ఏమైనా నటించేస్తున్నాడా అంటే… అంత లేదక్కడ. ప్రతీ సన్నివేశానికీ ఒకటే ఎక్స్ప్రెషన్తో బోర్ కొట్టిస్తున్నాడు. నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఇలా చాలా చాలా పాత్రలు పోషించడం వల్లనేమో.. దేనిపైనా ఆర్పీ సరైన దృష్టి పెట్టక సక్సెస్ కాలేకపోతున్నాడనిపిస్తోంది. దర్శకుడిగా రాణించడమే ఆర్పీ ధ్యేయం అయితే.. వెంటనే నటనకు దూరం అయితే ఇంతకంటే మంచి అవుట్ పుట్ వస్తుందేమో.. ఆర్పీ.. ఒక్కసారి ట్రై చేయరాదూ..?