తెలుగుదేశం పార్టీలో ఎవరు పవర్ ఫుల్… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా..? కుమారుడు, యువనేత నారా లోకేషా..? ఇదే విషయంపై ఓ ఆసక్తికరమైన కథనం వెలుగులోకి రావడంతో ఈ చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్టీలో లోకేష్ బాబు మాటకే ప్రాధాన్యత ఎక్కువనీ, చంద్రబాబు మాటకంటే ఆయన మాటలకే విలువ ఎక్కువంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఉదాహరణగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది మార్చుతూ జరిగిన ఓ నిర్ణయాన్ని ఊటంకించింది. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ఇద్దరు కీలక అధికారులను ఉన్నపళంగా బదిలీ చేయడానికి కారణం లోకేష్ బాబు పట్టుదలే అంటున్నారు! చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందునుంచే సెక్యూరిటీగా ఉంటున్న ఆ ఇద్దరి బదలీ నిర్ణయం లోకేష్‌దే అనీ, లోకేష్ ఏదనుకుంటే అది జరిగిపోతుందనీ, ఈ లెక్కన తెలుగుదేశంలో ఇప్పుడు చంద్రబాబు కంటే లోకేష్ పవర్ ఫుల్ అని ఆ కథనం పేర్కొంది.
నిజానికి, లోకేష్ తెలుగుదేశంలో చాలా శక్తిమంతుడు అని చెప్పడానికి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా చెబుతాయనే వాదన ఉంది. ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడిగా ఉంటున్న ఒక మంత్రిని పదవి నుంచి తప్పించేందుకు చంద్రబాబు నిర్ణయించారనీ, అదీ లోకేష్ ఒత్తిడి మేరకే అనే ఆరోపణలు ఉన్నాయి! ఇంకా ఆ నిర్ణయం అమల్లోకి రాకపోయినా… దాని వెనక లోకేష్ చక్రం తిప్పారని పుకార్లు ఉన్నాయి. ఇక, మీడియా విషయంలో కూడా లోకేష్ బాబు చెప్పినట్టుగా జరగాలని కూడా అంటారు! ఆ మధ్య అమరావతిపై ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ఒక సీనియర్ జర్నలిస్టు లైవ్ షో నిర్వహిస్తే… చినబాబుకే కోపం వచ్చిందట. ఆయన హుకూం ప్రకారమే సదరు సీనియర్ పాత్రికేయుడు ఆ ఛానెల్లో లేకుండా చేశారని కూడా విమర్శలున్నాయి.
ఓ సీనియర్ నాయకుడిని తన ఛాంబర్ ముందు గంటలకొద్దీ లోకేష్ కూర్చోబెట్టారన్న కథనాలు కూడా గతంలో వచ్చాయి. చినబాబు సంగతి తెలిసి కూడా సీనియర్లు సర్దుకుపోతున్నారనే వాదన కూడా ఉంది. పార్టీపై పట్టు సాధించాలన్న క్రమంలో లోకేష్ పట్టుదలకు పోతున్నారనే వారూ ఉన్నారు! ఈ లెక్కన తెలుగుదేశం పార్టీలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నట్టు..? ఎవరి మాట నెగ్గుతున్నట్టు..? అయినా, పార్టీలో ఉండాల్సింది అంతర్గత ప్రజాస్వామ్యంగానీ, వ్యక్తిగత పట్టుదల కాదుకదా!