ఆడియో ఫంక్షన్‌కి పవన్ రాక… సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాకి ఊహించని హైప్ తీసుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ని ఇప్పటి వరకూ అన్ని లింకుల్లో కలిపి 25 లక్షలమంది వీక్షించారు.. అదంతా పవన్ రాక మహిమే అని చిత్రబృందం సంబరపడిపోతోంది. అంతేకాదు.. ట్రైలర్ బయటకు రాగానే పంపిణీదారులు ఎంక్వైరీలు మొదలెట్టేశారు. ఈ సినిమాని అవుట్ రేట్‌కి కొనడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్. ఈ సంబరాన్ని చిత్రబృందం కూడా పవన్ కల్యాణ్ తో పంచుకొంది. ఈ రోజు ఉదయం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టీమ్ పవన్ కల్యాణ్‌ని మర్యాద పూర్వకంగా కలుసుకొంది. ఆడియో ఫంక్షన్‌ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొంది. ఈ సందర్భంగా పవన్.. ‘సినిమా ఎప్పుడు చూపిస్తున్నావ్’ అని సప్తగిరిని ప్రత్యేకంగా గుర్తు చేసినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయని, తొలి షో మీకే వేస్తామని చిత్రబృందం చెప్పిందట. ఆడియో ఫంక్షన్లో పవన్ `సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చూడాలని వుంది` అంటూ మనసులోని కోరికను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అదేం సభామర్యాద కోసం కాదని, పవన్ నిజంగానే ఈ సినిమా చూడాలన్న ఉత్సుకత చూపిస్తున్నాడని తెలిసి చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది.
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాకి రూ.6 కోట్ల బడ్జెట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ కమెడియన్‌పై ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం నిజంగా సాహసమే. అయితే.. కంటెంట్‌తో పాటు తమ సినిమాలో క్వాలిటీ కూడా ఉందని, సినిమా చుట్టేయలేదని, అందుకే అంత ఖర్చయ్యిందని నిర్మాత చెబుతున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్టుల లిస్టు ఈసినిమాలో చాంతాడంత ఉంది. పైగా ఫారెన్‌లో పాటలు తెరకెక్కించారు. ప్రతీ సీన్ లావిష్గానే తీయడానికి ప్రయత్నించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలా… బడ్జెట్ తడిసిమోపెడయ్యింది. పవన్ రాకతో.. పవన్ ఆశీస్సులతో.. అదంతా రాబట్టుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.