జరుగుతున్నది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడుస్తున్న వ్యవహారమనీ తెలుసు..! సాగుతున్నది నీతిబాహ్యమైన రాజకీయామనీ ప్రజాతీర్పుకి వెక్కిరింపు అనీ వారికి తెలుసు..! అయినాసరే, వ్యవస్థను కాపాడాల్సిన అధికార పార్టీలే రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న చిత్రాన్ని మనం చూస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు విచ్చలవిడిగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. చేస్తున్న గొప్పపనికి ‘ఆపరేషన్ ఆకర్ష్’ అనే ముద్దుపేరొకటి! తెలంగాణలో ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అనీ, ఆంధ్రాలో ‘అభివృద్ధిలో భాగస్వామ్యం’ అనీ.. పైపైన చాక్లెట్ రేపర్లను తగిలించి, ఆ ముసుగులో ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారు కేసీఆర్, చంద్రబాబులు! ఫిరాయింపుదారులకు కూడా మంత్రి పదవులు ఇచ్చే గొప్ప సంస్కృతిని కేసీఆర్ ప్రవేశపెడితే… ఈ ఫిరాయింపులను మున్సిపాలిటీల స్థాయికి విస్తరించిన ఖ్యాతి చంద్రబాబుకు దక్కుతుంది! అయితే, ఈ విచ్చలవిడి ధోరణికి చెక్ పడే రోజు ముందుంది అనిపిస్తోంది. తెరాస ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. వ్యవహారం రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్లింది.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టి. స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదన్న వాదనతో కాంగ్రెస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, స్పీకర్ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకూడదన్న వాదనను అడ్వొకేట్ జనరల్ వినిపించారు. అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయమూ వెలువరించనప్పుడు, సుప్రీం కోర్టులో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఈ వాదనకు న్యాయమూర్తులు స్పందిస్తూ… అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎన్నాళ్లు మౌనంగా ఉంటారని తిరుగు ప్రశ్నించారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల జరగాల్సిన నష్టం జరుగుతోందనీ, ఈ క్రమంలో వాస్తవాలను చూస్తూ ఊరుకోలేమనీ, స్పీకర్ స్పందిస్తారన్న నమ్మకం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సభకు సంబంధించి స్పీకరే సుప్రీం, అయినప్పటికీ ఆయన నిర్ణయాలపై సమీక్షించే వీలుందనీ, అయినా ఈ వ్యవహారంపై రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
నిజానికి, స్పీకర్ తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదన్న ఒకేఒక్క లొసుగును అడ్డం పెట్టుకుని తెరాస ఫిరాయింపు రాజకీయాలను యథేచ్ఛగా కొనసాగించిందని చెప్పాలి. అయితే, అనర్హులపై వేటు వేయకుండా జాప్యం చేస్తున్న స్పీకర్ వైఖరిని రాజ్యాంగ ధర్మాసనం తప్పు బడితే… ఈ కేసు చారిత్రకం అవుతుంది. తీర్పు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఫిరాయింపుల కేసు తీర్పు కలకలకం సృష్టించే అవకాశాలున్నాయి. జంప్ జిలానీలపై వేటు పడితే… ఇద్దరు చంద్రులకూ తలపోటు తప్పదు..! ఏదేమైనా, ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడకపోతే, ఇవాళ్ల ఆంధ్రా తెలంగాణల్లో అధికార పార్టీలు అనుసరిస్తున్న దిక్కుమాలిన రాజకీయ ఎత్తుగడనే ఇతర పార్టీలు ఆదర్శంగా తీసుకోవని గ్యారంటీ లేదు కదా!