ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వీటిస్థానంలో రూ.500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. సడన్ సర్ ప్రైజ్ తో సామాన్యుడు ఇబ్బందులు పడితే… సడెన్ షాక్ తో నల్లసొమ్మున్నొడు తేలు కుట్టిన దొంగలా ఇబ్బందిపడుతున్నాడు. ఆ సంగతులు అలా ఉంటే… కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయబోయే రూ. 2000 నోటు విషయంలో రకరకాల వార్తలు ఆన్ లైన్ వేదికగా ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడనుంచి మొదలయ్యాయో కానీ… ఆ నోటు నేరుగా చూసినవారెందరో కానీ… ఈ నోటులో లో నానో జీపీఎస్ చిప్ ఉంటుందని గాసిప్పులు సృష్టించారు.
అవును.. కొత్త 2000 నోట్లు ఎవరు పెద్దమొత్తంలో దాచినా, అవి ఎక్కడ ఉన్నాయో ఆదాయపన్నుశాఖ (ఐటీ) సులువుగా కనుక్కోగలదని, దానికోసం ఆ నోటులో చిన్న చిప్ కూడా ఉంటుందని పెద్ద ఎత్తున వదంతులు ఫేస్ బుక్, వాట్సాప్ లో షికార్లు చేశాయి. ఈ నోట్లలో ఉండే నానో జీపీఎస్ చిప్ లు చాలా శక్తిమంతమైనవనీ, భూమిలో 120 మీటర్ల లోతులో నోట్లను పాతిపెట్టినా కూడా రాడర్ నిఘా నుంచి తప్పించలేరని తద్వారా వీటిని ఐటీ అధికారులు ట్రాక్ చేసే వీలు ఉంటుందని వదంతులు భారీగా వచ్చాయి. అయితే, ఈ వదంతులన్నీ ఉత్తవేనని తాజాగా భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తేల్చింది. రూ. 2000 నోటుకు సంబంధించిన ఆర్బీఐ ఇచ్చిన వివరణలో ఎక్కడా ఈ నానో చిప్ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంతేకాకుండా నోటులో చిప్ ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆర్బీఐ ఇప్పటికే తోసిపుచ్చింది. రూ. 2వేల నోట్లలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాసిప్పులేమీ ఉండవని స్పష్టం చేసింది.