ఈ సంక్రాంతి వార్… నందమూరి బాలకృష్ణ, చిరంజీవి మధ్యే అనుకొన్నారంతా. ఎందుకంటే బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి, చిరంజీవి 150వ చిత్రం ఖైది నెం.150 ఈ సంక్రాంతికే రాబోతున్నాయి. రెండు భారీ సినిమాలు పోటీ పడుతుంటే.. మధ్యలో ఇరుక్కోవడానికి ఎవ్వరికైనా ధైర్యం చాలదు. అందుకే మిగిలిన సినిమాలు పోటీ నుంచి తప్పుకొన్నాయనుకొన్నారు. అయితే…. వీరిద్దరికీ షాక్ ఇవ్వబోతున్నాడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న గురునీ ఈ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట. నిజానికి జనవరి 26న గురుని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వెంకీ మాత్రం.. ఈ సినిమాని ముందుకు జరపాలన్న నిర్ణయం తీసుకొన్నట్టు టాక్. వెంకీ రాక… మిగిలిన రెండు చిత్రాలపై ప్రభావం చూపించే అకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలోకలసి దాదాపు 1800 థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. మహేష్, ఎన్టీఆర్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా 1200 థియేటర్లలో రిలీజ్ అవుతాయి. అయితే సోలో రీలీజ్లకే ఈ ఫీట్ సాధ్యం అవుతుంది. సంక్రాంతికి రెండు సినిమాలొస్తాయి కాబట్టి చిరు, బాలయ్యలు థియేటర్లను పంచుకోవాల్సివస్తోంది. వాటిలో వెంకీ వాటాకు రావడం నిజంగా షాక్‌కి గురిచేసేదే. సురేష్ బాబు చేతిలో దాదాపుగా 380 థియేటర్లున్నాయి. అందులో ఈస్ట్, వెస్ట్‌లలో ఉన్న థియేటర్లే ఎక్కువ. ఇవన్నీ ఇప్పుడు గురుకి వెళ్లిపోవడం ఖాయం. ఇప్పటికే రెండు సినిమాల పోటీ వల్ల.. రావాల్సిన థియేటర్ల కంటే తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి. వాటి మధ్య వెంకీ కూడా బరిలో దిగడంతో .. థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. సంక్రాంతి సీజన్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదన్నది వెంకీ ఆలోచన. దానికి తోడు ఆఖరి నిమిషాల్లో ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి డ్రాప్ అయినా.. తనకు మంచి అవకాశాలుంటాయన్న ఆలోచన కూడా ఉండొచ్చు. అందుకే.. ఈ ఎత్తుగడ వేశాడేమో అనిపిస్తోంది. దీనంతటి వెనుక సురేష్ బాబు మైండ్ గేమ్ కూడా ఉందని అని తెలుస్తోంది. ఈ ముక్కోణపు పోటీ చూడ్డానికి, మాట్లాడుకోవడానికీ బాగానే ఉన్నా, సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయం. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.