అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కంపు వ్యాఖ్యలతో అన్‌పాపులర్ అయిన ట్రంప్ గెలుస్తారని ఎవ్వరూ ఊహించలేదు! అంతేకాదు, సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగానే వచ్చాయి. ఆమె ఓటమికి చాలా కారణాలున్నాయి విశ్లేషణలు వస్తున్నాయి. ఈ దశలో హిల్లరీ ఓటమికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణం అంటూ ఓ కొత్త సెంటిమెంట్‌ను తెరమీదికి తెచ్చింది వైకాపా. ఇప్పటికే, చంద్రబాబుపై కొన్ని సెంటిమెంట్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైకాపా ప్రయత్నం చేస్తూనే ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కరవు వస్తుందని ఎప్పటికిప్పుడు వైకాపా నేతలు ఆరోపిస్తూ ఉంటారు.
ఈ మధ్య ఆంధ్రాలో వరద వచ్చిన సందర్భంలో కూడా ప్రతిపక్ష నేత జగన్ ఇదే మాటను మరోసారి చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏదో ఒక రూపంలో ఆంధ్రాకి కరవు వస్తుందన్నారు.అయితే, భారీ వర్షాలూ లేదంటే, అస్సలు వర్షాలు ఉండవంటూ విమర్శించారు. తాజాగా హిల్లరీ ఓటమికి కారణం కూడా చంద్రబాబు నాయుడే అంటూ ఆరోపిస్తున్నారు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. హిల్లరీ గెలుపు లాంఛనమే అని ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారనీ, ఆ మద్దతు వల్లే ఆమె ఓటమి పాలయ్యారు అన్నారు. హిల్లరీకి ఓటెయ్యమని అమెరికాలోని తెలుగువారికి లేఖలు రాశారనీ, ఆమె ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం అందిందనీ, ఆయన వెళ్తారంటూ అత్యుత్సాహ ప్రకటనల వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని ఆరోపించారు. తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు ఎవరికి మద్దతు ఇచ్చినా వారు ఓడిపోతారనీ, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలౌతారని చెవిరెడ్డి అంటున్నారు.
చంద్రబాబు మద్దతుకు హిల్లరీ ఓటమికీ సంబంధం ఉందా చెప్పండీ! ఆంధ్రా ముఖ్యమంత్రికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమికీ లింక్ ఎలా కుదురుతుంది..? ఏదో ఒక సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ప్రయోజనాలు ఆశించడం తప్ప.. ఈ వ్యాఖ్యల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.! వర్షాలకీ చంద్రబాబుకూ పెట్టిన లింకునే ఇంకా వైకాపా వదలడం లేదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తే వారు ఓడిపోతారన్న సెంటిమెంట్ తెచ్చేందుకు వైకాపా ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి విమర్శలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. గత ఎన్నికల్లో చేసిన విమర్శల్నే ఇప్పటికీ చేస్తుంటే ఎలా..? చంద్రబాబు ఓటమి అనేది వేరే విషయం… దానికీ, హిల్లరీ ఓటమికి లింక్ కుదర్చలేకపోయారు కదా! ఇలాంటి కామెంట్ల వల్ల లేనిపోని గందరగోళం క్రియేట్ చేయడం తప్ప… పార్టీకి పనికొచ్చే అంశమైతే ఇది కాదు!