రచయితగా ఉన్నప్పుడు కొరటాల శివ పారితోషికం లక్షల్లో ఉండేది. దర్శకుడిగా మారి… ఎప్పుడైతే ఓ హిట్టు కొట్టాడో – కోట్లకు కోట్లు తీసుకొంటున్నాడు. జనతా గ్యారేజ్‌కి కొరటాల పారితోషికం రూ.10 కోట్లకు పైనే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయి వంద కోట్ల క్లబ్లో చేరింది. దాంతో 4 వ సినిమాకి పారితోషికం అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ సినిమా కోసం కొరటాల రూ.13 కోట్ల పారితోషికం అందుకొన్నాడట. అయితే ఇప్పుడో కొత్త ఆలోచన వచ్చింది కొరటాలకు. పారితోషికం వెనక్కి ఇచ్చేసి – ఓవర్సీస్ రైట్స్ డిమాండ్ చేద్దామనుకొంటున్నాడట. మహేష్ బాబు సినిమా అంటే ఓవర్సీస్లో రూ.15 కోట్ల వరకూ పలుకుతుంది. అంటే రైట్స్ రూపంలో మరో రెండు కోట్లు ఎక్కువ లాగుదామనుకొంటున్నాడన్నమాట. వసూళ్లు రూ.15 కోట్లు దాటాకా వచ్చిన లాభాల్లో సగం, సగం తీసుకొందామన్న ప్రతిపాదన తీసుకొచ్చాడట. దానికి నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ లెక్కన కొరటాల ఎత్తుగడ పారితే… అత్యధిక పారితోషికం తీసుకొనే తెలుగు దర్శకుల్లో రెండో స్థానంలో ఉంటాడు. తొలి స్థానం ఎప్పటికీ రాజమౌళిదే. త్రివిక్రమ్ కి రూ.12 కోట్లు, వినాయక్ కి రూ.10 కోట్లు అందుతున్నాయి. రచయితగా ఎన్ని సినిమాలకు పనిచేస్తే ఇంత మొత్తం వస్తుంది? అందుకే…. రచయితలంతా మెగాఫోన్లు పడుతున్నారు, దర్శకులు అవుతున్నారు.