కృష్ణ ఇంటి నుంచి వచ్చిన వారసురాలు మంజుల. షో అనే సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ తరవాత నటిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కొంతకాలంగా మంజుల చడీ చప్పుడు చేయడం లేదు. ఇప్పుడు కొంత కాలం గ్యాప్తరవాత మెగా ఫోన్ పట్టుకోవడానికి ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయినట్టు సమాచారం. ఇప్పుడు హీరో వేటలో ఉంది చిత్రబృందం. ఈ స్క్రిప్ట్ సందీప్ కిషన్దగ్గరకు వచ్చినట్టు టాక్. సందీప్ ఇటీవల కథ విని, ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. సందీప్ ప్రస్తుతం నక్షత్రం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఓ తమిళ దర్శకుడి కథకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నక్షత్రం సినిమా పూర్తయిన వెంటనే ఈ రెండు సినిమాలూ ఒకేసారి పట్టాలెక్కుతాయని తెలుస్తోంది. మంజుల సినిమా అంటే.. దానికి ప్రమోషన్లు ఎక్కువగా ఉంటాయని, విడుదలకు ముందు విపరీతమైన హైప్ రావడం ఖాయమని సందీప్ భావించాడట. ఎలాగూ.. మహేష్‌ని కూడా ప్రమోషన్లకు వాడుకోవొచ్చు. సందీప్ కిషన్ సినిమాలు ఇటీవల సరైన ప్రచారం లేక ఫెయిల్ అవుతున్నాయని, ఈసారి పబ్లిసిటీ గట్టిగా చేసేవాళ్లతోనే సినిమాలు చేయాలని ఫిక్సయ్యాడని చెబుతున్నారు. అందులో భాగంగానే.. ఈ సినిమాకి సంతకం చేసేశాడట. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.