తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసి సంగతి తెలిసిందే. అనంతపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. దేశం నేతల అవినీతి పెరుగుతోందనీ, పార్టీ ఒక వర్గం వారిదే అనే అభిప్రాయం ఎక్కువౌతోందనీ, ఇలా అయితే వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు! ఇంత తీవ్ర వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నుంచి పవన్‌కు ఘాటైన జవాబు ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, తెలుగుదేశం నాయకుల ఎవ్వరూ తొందరపడకుండా కట్టడి చేసింది అధినాయకత్వం! జనసేనాని ఆరోపణలపై ఆచితూచి స్పందిస్తోంది తెలుగుదేశం. పవన్ కల్యాణ్ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ స్పందిస్తూ… ఆయన చేసిన వ్యాఖ్యల్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నాం అని ముక్తాయించారు, అంతే! ఇక, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప పవన్ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడారు అని చెప్పాలి.
ఆంధ్రా సర్కారుపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయనీ, తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్టు తన దృష్టికి వచ్చిందని రాజప్ప అన్నారు. అయితే, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అందులో వాస్తవాలను పవన్ కల్యాణ్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. తనకు అందుతున్న సమాచారంలో తప్పుంటే… ఆ విషయాన్ని కూడా తనకూ తెలపాలని రాజప్ప స్పందించారు! ఇతర నేతలు కూడా ఇదే ధోరణి అనుసరించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా పవన్ కల్యాణ్‌పై ప్రస్తుతం విమర్శలు గుప్పించే పరిస్థితి లేదని అర్థమౌతోంది.
ఎందుకంటే, ‘కులం కుటుంబం మమకారం వదలుకుని రాజకీయాల్లోకి వచ్చాను’ అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు కదా! ఆ మాటల్లోని అంతరార్థం తెలుగుదేశం పార్టీకి అర్థం కానిదేం కాదు కదా. ఇప్పటికే, కాపులు తెలుగుదేశం పార్టీకి దూరమౌతున్నారన్న భావన ఏర్పడింది. రిజర్వేషన్ల ఉద్యమంతో ముద్రగడ ఒక వర్గాన్ని పార్టీ నుంచి చీల్చుతున్నారన్న భావన బలపడుతోంది. ఈ తరుణంలో పవన్‌పై ఘాటైన ప్రతివిమర్శలు చేస్తే… ఆ సామాజిక వర్గం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తం కావొచ్చన్నది దేశం భయం! తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ అనే ఇమేజ్ కోసం ఈ మధ్య పాకులాడుతున్నారు! అందుకే కదా.. కార్తీకమాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఆ కుల సంఘాల వనభోజనాలకు కూడా దేశం నేతలు వెళ్లడం లేదు! ఈ నేపథ్యంలో పవన్ కూడా తెలుగుదేశాన్ని ఆ కులపార్టీ అనే మీనింగ్‌లో మాట్లాడేసరికి… విషయం సెన్సిటివ్ అయిపోయింది. ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం అనే పరిస్థితి వచ్చేసింది. అందుకేనేమో… పవన్ అవినీతి ఆరోపణలు చేసినా కూడా సుతిమెత్తగా…. ఇంకా చెప్పాలంటే చాలా ‘పాజిటివ్‌గా’ రియాక్ట్ అవుతున్నారు!