పెద్ద నోట్ల రద్దు… చిత్రసీమని పెను ప్రమాదంలో పడేస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాలు కాసుల గలగల లేక మొహాలు తేల్చేశాయి. అందరి దృష్టీ బ్యాంకులపై, ఏటీఎమ్ సెంటర్లపై ఉంటే… థియేటర్ వైపుకు నడిచే వాళ్లెవరు..? అందుకే వచ్చే వారం కూడా సినిమాలొస్తాయా, లేదా? అనేదీ అనుమానంలో పడింది. అందరి కంటే ఎక్కువ కంగారు అల్లు అరవింద్‌కే ఉంది. రాబోయే రోజుల్లో వస్తున్న పెద్ద సినిమా.. ధృవ కావడం ఆ కంగారుకి అసలు కారణం. రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన తని ఒరువన్ రీమేక్ ధృవ గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే తెరకెక్కింది. డిసెంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే.. మూడు వారాల టైమ్ ఉంది. కానీ ‘పెద్ద నోటు’ దెబ్బ తమ సినిమాపై పడుతుందని బెంగ పెట్టుకొన్నాడట అల్లు అరవింద్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధృవ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అనే విషయంలో అల్లు అరవింద్ తర్జన భర్జనలు పడుతున్నట్టు టాక్.
రామ్ చరణ్ కెరీర్ అసలే గందరగోళంలో ఉంది. వరుస ఫ్లాప్స్‌తో… టాప్ హీరోల రేసులో బాగా వెనుకబడిపోయాడు. ధృవతో హిట్టు కొట్టడం చరణ్‌కి అత్యవసరం. అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నాడట. ‘అవసరమైతే కాస్త లేటుగా వద్దాం’ అంటూ అరవింద్‌కి కూడా హింట్ ఇచ్చేశాడట. మూడు వారాల గ్యాప్ ఉంది కాబట్టి.. కంగారు పడాల్సిన పని లేదు. కానీ.. అరవింద్ ఏమాత్రం అతి జాగ్రత్తకి పోయే రకం. అందుకే.. ‘కనీసం మరో వారం ఆగుదాం’ అంటున్నాడట. దానికి చరణ్ కూడా ఓకే అనేయడంతో.. ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. వచ్చే వారం సినిమాల పరిస్థితి, వసూళ్లు… వీటిని పరిగణలోకి తీసుకొని అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తే మంచిదన్న నిర్ణయంలో ఉన్నాడట అరవింద్. సో.. ధృవ కొత్త రిలీజ్ డేట్ కోసం వేచి చూడక తప్పదు.