సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం తెలుగు పరిశ్రమలో అనుష్కకే సాధ్యం అనుకొన్నాం. అయితే అనుష్కకు ఇప్పుడు అనసూయ కూడా పోటీకి వచ్చింది. ఓ ఐటెమ్ పాట కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది అనసూయ. ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. ‘విన్నర్’. ఈ సినిమాలో అనసూయ ఓ ఐటెమ్ గీతంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం అనసూయ ప్రత్యేక కసరత్తులు చేసిందట. ఏకంగా 12 కిలోల బరువు పెరిగిందట. ”మరీ సన్నగా కనిపిస్తున్నావ్. ఐటెమ్ గాళ్ అంటే కాస్త బొద్దుగా ఉండాలి” అని దర్శకుడు సూచిస్తే.. దాన్ని తు.చ తప్పక పాటించిందట అనసూయ.
సన్నబడాలంటే కష్టంగానీ, బరువు పెరగడం ఎంత సేపు..? అందుకే అనుకున్నదే తడవుగా బరువు పెరిగిందట. అయితే కథానాయికలు బరువు పెరగడానికి పెద్దగా ఇష్టపడరు. వెంటనే బరువు తగ్గడం కష్టం కాబట్టి. అది తమ గ్లామర్పైనా ప్రభావం చూపిస్తుంది. కానీ అనసూయ మాత్రం ఈ రిస్క్ చేయడానికి ముందుకొచ్చింది. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదేమంటే.. ఈ పాట ‘అనసూయ’ అనే పేరుతోనే మొదలవుతుందట. తన పేరు మీదే పాట ఉంది కాబట్టి, తనకు మరింత ప్లస్ అవుతుందని, తన పేరుతో వచ్చిన పాటలో నటించే అవకాశం మరో ఐటెమ్ గాళ్కి ఇవ్వడం ఎందుకూ.. అని ఈ రిస్క్ చేయడానికి ఒప్పుకొందని తెలుస్తోంది. దానికి తోడు పారితోషికం కూడా బాగానే గిట్టుబాటు అయ్యిందని టాక్. అందుకే.. బరువు పెరగమంటే మరేం ఆలోచించకుండా రంగంలోకి దిగిపోయింది. మరి బొద్దు బొద్దు అవతారంలో ఈ హాట్ భామ ఎంత ముద్దుగా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.