త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రముఖ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ వంటి మున్సిపాలిటీలపై ప్రధాన పార్టీల కన్ను ఉంటుంది. నిజానికి, అధికార పార్టీ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు పెద్ద సమస్యగా ఉండదు. ఎందుకంటే, అధికారం వారి చేతులో ఉందీ, నాయకులూ మంత్రులూ ఎంత ఖర్చుకైనా వెనకాడరు! కాబట్టి, ఆ ఎన్నికలు ఒక లెక్కా అనే ధీమాతో ఉంటారు. కానీ, ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి అలా లేదు. మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇప్పటికే కొంత ఆందోళన ఉంది. దానికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా కొత్త సమస్యగా మారుతోంది!
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న అసంతృప్తి ప్రజల్లో లేదని చెప్పలేం. ఈ అసంతృప్తిని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బయటపెట్టే ప్రమాదం ఉందనే పక్క బెదురు మొదట్నుంచీ తెలుగుదేశం పార్టీకి ఉంది. పైగా, ఆ అంశాన్నుంచి ప్రజల దృష్టి మరల్చే పరిస్థితి కూడా లేకపోయింది. ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రతిపక్షనేత జగన్లు పోటాపోటీగా ప్రత్యేక హోదా ఉద్యమాలను ఇంకా పెంచి పోషిస్తున్నారు! నిజానికి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పినట్టు అది ముగిసిన అధ్యాయమే అయినా… ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారి పోరాటాలు సాగుతున్నారు. ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో తమపై పడుతుందని తెలుగుదేశం ఆందోళన చెందుతోంది! ఇది చాలదన్నట్టు… పెద్ద నోట్ల నిర్ణయం రెండు రకాలుగా తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
ఒకటీ.. మున్సిపల్ ఎన్నికల్లో ధారాళంగా డబ్బు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని చెప్పాలి! ఇలాంటి ఖర్చులకు వాడేది నల్లధనమే అనే విషయం ఓపెన్ సీక్రెట్. అయితే, తాజా నిర్ణయంతో పార్టీకి డబ్బులు ఇచ్చేవారు ఉండరు, ఖర్చు పెట్టేవారూ ఉండరు! ఇక, రెండో సమస్య… పెద్ద నోట్ల నిర్ణయంవల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న మధ్య తరగతి వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పెళ్లిళ్లు శుభకార్యాలు పెట్టుకున్నవారు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో మోడీ సర్కారుపై సామాన్యుడు కడుపుమంటతోనే ఉన్నాడు. ఆ వ్యతిరేకత మిత్రపక్షమైన తెలుగుదేశంపై పడే అవకాశం ఉంది. పైగా, నల్లధనం పోరాటంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేయమని తానే ప్రధానికి లేఖ రాశానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సో… కేంద్ర నిర్ణయం మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి దెబ్బతీసే అంశంగా పరిణమించే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు… కేంద్ర నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఇబ్బందులు వస్తాయేమో అనే ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో మొదలైందని తెలుస్తోంది.