తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే అయినా… ఆ క్రెడిట్ ఏమాత్రమూ దక్కించుకోలేకపోయింది..! రాష్ట్రాన్ని ఇచ్చింది తామే అని ఎంతగా ప్రచారం చేసుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పటికీ అదే పరిస్థితి! ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో ప్రభావం చూపలేకపోతోంది. రాజకీయంగా తెరాసను తట్టుకోలేకపోతోందనే చెప్పాలి. అయితే, ఈ పరిస్థితికి కారణం స్వయంకృతం అని చెప్పాలి. పార్టీలో నాయకుల మధ్య ఐకమత్యం కొరవడుతోంది. పైగా, పార్టీ నేతలు ఎవరు ఎప్పుడు పార్టీని వదిలిపెట్టి, తెరాసలో చేరిపోతారో అనే ఒక అభద్రతా భావం కూడా ఉంది. వలసల దెబ్బ బాగానే పడింది! జానారెడ్డి, హన్మంతరావు వంటివారు సీనియర్ నేతలే అయినా.. పార్టీని ఒకేతాటిపై నడిపేంత చొరవ వారు తీసుకోలేరు! పోనీ, రాష్ట్ర పార్టీ భారాన్నంతా భుజాల మీద మోస్తున్న ఉత్తమ్ కుమార్ నాయకత్వంపై కొంతమంది నాయకులకు నమ్మకం తక్కువ.
ఇంకోపక్క… ఛాన్స్ వస్తే పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధంగా ఉన్నట్టు కోమటిరెడ్డి సోదరులు సంకేతాలు ఇస్తున్నారు. పీసీసీ పీఠాన్ని మార్చాల్సి వస్తే.. తమకు అవకాశం ఇవ్వాలనీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పాదయాత్ర చేసి, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని వారు అంటున్నారు! ఓవరాల్‌గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యువనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు.
ఆదివారం జరిగిన ఓ సమావేశంలో రాహుల్ పర్యటనకు సంబంధించిన చర్చ జరింది. నిజానికి, రాహుల్ పాదయాత్ర చేస్తే ఉంటుందన్న ఆలోచన కాంగ్రెస్ నేతల మధ్య చర్చకు వచ్చింది. కానీ, పాదయాత్ర కంటే బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం మెజారిటీ నేతల నుంచి వ్యక్తమైంది. దీంతో డిసెంబర్ 9న భారీ బహిరంగ ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయించినట్టు సమాచారం! అంతేకాదు, సభలో రాహుల్‌తో ఏయే అంశాలపై మాట్లాడింపజేయాలనేది కూడా చర్చించుకున్నారట. తెలంగాణలో రైతుల సమస్య, తెరాస వైఫల్యాలను రాహుల్ ఎండగట్టాలని భావిస్తున్నారు.
అయితే, రాహుల్ ఏయే అంశాలపై మాట్లాడాలో అని రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తుంటే… తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని ఒకతాటి మీదికి తీసుకొచ్చేందుకు ఈ పర్యటనను ఉపయోగపడాలని అధిష్టానం భావిస్తుందని చెప్పాలి! ఎందుకంటే, తెలంగాణ పీసీసీతోపాటు కమిటీని కూడా సమూలంగా మార్చాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగా రాహుల్ రాష్ట్రానికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాహుల్ సభ తరువాత పార్టీకి నయాజోష్ వస్తుందని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి, రాహుల్ రాక టి. కాంగ్రెస్ దశను మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. రాహుల్ ముందు నేతల పంచాయితీలు ఏవిధంగా ఉంటాయో మరి!