హైపర్ తరవాత రామ్ సినిమా ఏదీ అనేది ఇంత వరకూ తేలలేదు. అనిల్ రావిపూడి కథకు ఓకే చెప్పినా… చివరి నిమిషాల్లో ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడు రామ్. ఈలోగా చాలా కథలు విన్నాడు. అయితే ఏదీ రామ్‌ని ఎగ్జయిట్ చేయలేకపోయింది. ఎట్టకేలకు రామ్ ఓ కథకు ఓకే చెప్పి… దాన్ని పట్టాలెక్కించడానికి సిద్దమయ్యాడు. అవును.. రామ్ మనసుకు నచ్చిన కథ దొరకేసింది. ఆ కథ చెప్పి, ఓకే చేయించుకొన్నదెవరో కాదు.. కరుణాకరన్. తొలి ప్రేమతో సూపర్ డూపర్ దర్శకుల లిస్టులో చేరిపోయాడు కరుణాకరన్. అయితే ఆ తరవాత అన్నీ ఫ్లాపులే. రామ్‌తో తీసిన ఎందుకంటే ప్రేమంట సినిమా కూడా పట్టాలు తప్పింది. అయితే కరుణాకరన్ పై ప్రేమ తగ్గలేదు రామ్‌కి. అందుకే పిలిచి మరో అవకాశం ఇచ్చాడు. ఈసారి అద్దిరిపోయే కథ ప్రిపేర్ చేశాడట కరుణాకరణ్. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్లోనే తెరకెక్కిస్తారు. నేను శైలజతో లవ్ స్టోరీలపై మరోసారి మమకారం పెంచుకొన్న రామ్.. ఈ సారి పూర్తి స్థాయి లవ్ స్టోరీలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాంటి కథలు కరుణాకరన్‌కి అలవాటే. సో.. ఈ కాంబినేషన్ కి ఈసారి హిట్టు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కథానాయిక ఎంపికలో పడింది చిత్రబృందం. అది త్వరలో లాంఛనంగా కొబ్బరికాయ్ కొట్టేయబోతున్నారని సమాచారం.