ఒకరి నష్టం మరొకరికి లాభమంటే ఇదేనేమో. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీని ఏంచేయాలో దిక్కుతోచని కొందరు పెద్దలకు బంగారు నగల దుకాణాలు ఆపద్బాంధవుల్లా కనిపిస్తున్నాయట. హైదరాబాద్ లో ఎక్కువ ధరకు బంగారు నగలను కొనడం గత ఐదు రోజులుగా ఎక్కువైందట. అందుకే, ఆదాయ పన్నుతో పాటు కస్టమ్స్ అధికారులు ఈ దందాపై దృష్టి పెట్టారు.
కస్టమ్స్ అధికారులు మంగళవారం పలు నగల షోరూముల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ముఖ్యంగా సోమాజిగూడ, బషీర్ బాగ్, అమీర్ పేట, బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, ఆబిడ్స్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని షోరూముల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక అక్రమ లావాదేవీలను గమనించారని తెలుస్తోంది.
ఎక్కువ ధరకు నగలు అమ్మడం, నల్లధన కుబేరులకు సహకరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డ షోరూములపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అలాగే బంగారం కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులను కూడా చాలా షోరూముల్లో సరిగా నిర్వహిచండం లేదనే సంగతి బయటపడింది. నగరంలోని సుమారు మూడొంతుల దుకాణాల్లో పక్కాగా రికార్డులు లేవట.
స్మగుల్డ్ బంగారం గత కొన్ని సంవత్సరాలలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వచ్చిందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి బంగారం దొంగరవాణా జోరైంది. శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ స్మగుల్డ్ బంగారం భారీగా పట్టుబడుతోంది. కిలోల కొద్దీ బంగారాన్ని హైదరాబాద్ కు రవాణా చేయడానికి ప్రయత్నించి చాలా మంది దొరికపోయారు. అయితే దొరక్కుంగా బంగారాన్ని తీసుకువచ్చిన వారు కూడా చాలా మందే ఉండొచ్చని అధికారుల అనుమానం. పైగా పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకున్నారు చాలా మంది. అలాంటి వారికి సహకరించిన వ్యాపారులకు ఇక ముందు కష్టకాలం తప్పదంటున్నారు అధికారులు.