దేశ చరిత్రలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఓ అద్భుతం అని భాజపా గర్వంగా చెప్పుకోవచ్చు! కానీ, అలాంటి కీలక నిర్ణయం తీసుకునేముందు… క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సరైన కసరత్తు జరగలేదు అనేది వాస్తవం. ఫలితం… ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎటీఎమ్లకు వెళ్తే గంటలకొద్దీ క్యూ లైన్లు! ఏమైనా అంటే… సినిమా టిక్కెట్ల కోసం గంటలు వెయిట్ చేయడం లేదా, బస్ పాసుల కోసం క్యూల్లో నిలబడటం లేదా, రేషన్ దుకాణాల్లో క్యూలు లేవా… అనే లాజిక్కులు కొందరు మాట్లాడుతున్నారు! ఇప్పుడు జరగాల్సిన చర్చ అది కాదు కదా. ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడంలో కేంద్రం విఫలమైందన్నది పాయింట్. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయం తగ్గిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా… కొన్ని బయటపడలేకపోతున్నాయి, అంతే! వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులపై కూడా ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ పరిస్థితిలో కూడా ప్రచారార్భాటానికి భాజపా పోతోంది! ప్రధామంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ పెద్ద నోట్లను మార్చుకునేందుకు గాంధీనగర్లోని ఒక బ్యాంకుకు వెళ్లి, గంటలకొద్దీ క్యూలో నిలబడి కరెన్సీ నోట్లను మార్చుకున్నారు. వయసు మీద పడ్డావిడ ఇలా బ్యాంకుకు వెళ్లడమంటే కష్టమైన పనే. అయితే, దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది భాజపా. ప్రధానమంత్రి తల్లి కూడా క్యూలో నిలబడి నోట్లు మార్చుకున్నారంటూ కొంతమంది భాజపా నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే, దేశ భవిష్యత్తు కోసం ఆమాత్రం కష్టపడటంలో తప్పులేదన్న మెసేస్ ఇస్తున్నారు. అందరూ ఓర్చుకోవాలనే మాట్లాడుతున్నారే తప్ప… వాటిని నివారించే మార్గాలపై కేంద్రం ఇప్పటికీ దృష్టి పెట్టడం లేదు.
పెద్ద నోట్ల రద్దుతో ఇతర ప్రభుత్వ శాఖలకు పనిలేకుండా పోయింది. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దాంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు బోసి పోతున్నాయి. ఆ సిబ్బందిని బ్యాంకులకు తీసుకొచ్చి నోట్ల మార్పిడి వాడుకోవచ్చు కదా! అదనపు కౌంటర్లను తెరిస్తే క్యూ లైన్లు తగ్గుతాయి కదా! దేశంలో అత్యవసర సేవలకు అన్ని డిపార్ట్మెంట్లనూ వాడుకోవడం అనేది ఎప్పట్నుంచో ఉంది. ఎన్నికలు వస్తే ప్రభుత్వోద్యోగులందరినీ ఎలక్షన్ డ్యూటీలకు వేసినట్టు…. ఇతర డిపార్ట్మెంట్లను వాడుకోవచ్చే కదా! కనీసం ఇలాంటి ఆలోచనలేవీ చేయకుండా… ప్రధానమంత్రి తల్లి కూడా క్యూలో నిలబడ్డారని డప్పు కొట్టుకుంటే ఏంటి ప్రయోజనం…?
అయినా, అంత పెద్దావిడను బ్యాంకు వరకూ తీసుకెళ్లడమే పెద్ద ఫెయిల్యూర్! ఏం… ఆమె దగ్గర ఉన్న నోట్లను భాజపా కార్యకర్తలు ఎవరైనా బ్యాంకుకు తీసుకెళ్లొచ్చుగా..? గాంధీ నగర్ నిండా మోడీ చుట్టాలే కదా… వాళ్లలో ఎవరైనా సరే ముందుకొచ్చి, పెద్దవిడకు ఎందుకింత కష్టమని ఆ నోట్లేవో వారే మార్చి తేవొచ్చు కదా.? చివరికి ఆ పెద్దవిడ కష్టాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకుంటూ ఉంటే.. ఏమనుకోవాలి..?