పవన్ కల్యాణ్ వీర భక్తుల్లో నితిన్ ఒకడని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. నితిన్ తన సినిమాల్లో పవన్‌పై ఉన్న వీరాభిమానం చూపించడం, దానికి మురిసిపోతూ పవన్ కూడా నితిన్ ఆడియో ఫంక్షన్లకూ గట్రా వస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నితిన్ కోసం పవన్ కల్యాణ్ ప్రొడ్యూసర్‌గా మారాడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడు. నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి పవన్ – త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. నితిన్ కోసం కృష్ణ చైతన్య ఎప్పటి నుంచో ఓ కథ రెడీ చేసుకొని తిరుగుతున్నాడు. నితిన్‌కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల కృష్ణ చైతన్య కథ పక్కన పెట్టాల్సివచ్చింది. నిజానికి ఈ సినిమాని తన సొంత బ్యానర్లోనే చేద్దామనుకొన్నాడు. కానీ.. ఏమైందో ఇప్పుడు పవన్, త్రివిక్రమ్‌ల చేతికి ఈ సినిమా వెళ్లిపోయింది. నితిన్ హీరో.. పవన్, త్రివిక్రమ్‌లు ప్రొడ్యూసర్లు అనగానే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం. బహుశా నితిన్ ఆలోచన కూడా అదే అయ్యింటుంది. సొంతంగా సినిమా తీసుకోగలిగే స్టామినా ఉన్నా.. తన సినిమాని తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల చేతుల్లో పెట్టాడు. పవన్‌కి బయటి హీరోలతో సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో కోరిక. అందుకు తగిన ప్రణాళికలూ సిద్దం చేసుకొన్నాడు. తొట్ట తొలుత తన వీరాభిమానితోనే సినిమా చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా ఓ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిపోనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.