ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో జయమ్ము నిశ్చయమ్మురా ఒకటి. శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తుండడం, రిలీజ్‌కి ముందే మంచి బజ్ రావడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా మారాయి. దానికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయి. ఇండ్రస్ట్రీలు కొంతమంది హీరోలు, దర్శకులు ఈ సినిమా ప్రమోషన్లకు బాగా సహకరించారు. మొత్తానికి ఓ పాజిటీవ్ బజ్ ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదలకు ముందే పబ్లిక్ ప్రీమియర్ల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 5 చోట్ల స్పెషల్ షోలు వేశారు. పాత్రికేయులతో పాటు, కొంతమంది సినీ దర్శకులు ఈ సినిమాని విడుదలకు రెండు రోజుల ముందే చూసేశారు. వాళ్లందరి దగ్గర చిత్రబృందం ఫీడ్ బ్యాక్ తీసుకొంది. `సినిమా బాగుంది.. కానీ.. అక్కడక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుంది` అనేది అందరి ఉద్దేశం. అందుకే వెంటనే చిత్రబృందం అందుకు తగిన ఏర్పాట్లలో పడిపోయింది. రేపు విడుదల అనగా.. ఇప్పుడు కత్తెర్లు పట్టుకొని కూర్చుంది. ఫస్టాఫ్ లోని 10 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర్లు పడినట్టు టాక్. ట్రిమ్ చేసిన కొత్త వెర్షన్‌ని ఆదివారం సాయింత్రం నుంచీ చూడొచ్చట.
సాధారణంగా రిలీజ్‌కి ముందు ఇలా రీ ఎడిటింగ్ చేయడానికి ఎవ్వరూ సాహసించరు. దానికి తోడు ఎవరి సినిమాపై వాళ్లకు నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ‘మీ సినిమాలో ఇది బాలేదు. అది బాలేదు’ అని చెప్పినా పట్టించుకోరు. ‘రేపు సినిమా బయటకు వచ్చాక చూద్దురుగానీ’ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోతుంటారు. కానీ.. ఈ చిత్రబృందం మాత్రం ప్రీమియర్ షోలు వేశాక అందరి దగ్గర నుంచీ ఫీడ్ బ్యాక్‌లు తీసుకొంది. పాజిటీవ్ గా స్పందించింది. మంచి అవుట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమా ట్రిమ్ చేయడానికి ముందుకొచ్చింది. ఫస్టాఫ్ ట్రిమ్ చేయడంతో.. ఈ సినిమా మరింత రేసీగా సాగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా… శ్రీనివాసరెడ్డి జాతకం, ఈ సినిమా భవిష్యత్తు ఏమిటన్నది కొద్ది గంటలలో తేలిపోనుంది. హీరోగా శ్రీనివాసరెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.