డబ్బింగ్ సినిమా హిట్టవ్వడం అనేది ధనలక్ష్మీ లక్కీ లాటరీ తగలడం లాంటిది. ఏ పుట్టలో ఏ పాముందో చెప్పడం కష్టమన్నట్టు… ఏ సినిమా హిట్టవుతుందో అంచనా వేయడం చాలా చాలా కష్టం. బిచ్చగాడు టైటిల్ చూసి భయపడ్డారంతా! ఆ సినిమాని ఎవడు చూస్తాడులే అనుకొంటే రూ.15 కోట్లు పట్టుకెళ్లిపోయింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి, వాళ్లెవరికి ఓటేస్తారు అనేది కనుక్కోవడం ఈరోజుల్లో వెయ్యి నోటు మార్చుకోవడం రెండూ కష్టమే. అందుకే.. తమిళంలో ఓ మాదిరిగా ఆడిన ప్రతీ సినిమానీ తెలుగులో డబ్ చేసేద్దాం అనుకొంటుంటారు మనోళ్లు. కొండకు వెంట్రుక వేసి లాగే ప్రయత్నమే ఇదీ కూడా. అయితే దిల్‌రాజు లాంటి టేస్టున్న నిర్మాతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే… కాస్తో కూస్తో నమ్మకాలు పెరుగుతాయి. అలాంటి భరోసా కల్పించిన సినిమా ‘రెమో’. హీరో శివ కార్తికేయన్ తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా.. కీర్తి సురేష్ నిలబడ్డ పోస్టర్లు, ఆ సినిమా పేరు బహు కలర్ ఫుల్‌గా ఉన్నాయి. పైగా దిల్‌రాజు బ్రాండ్ ఒకటి తప్పకుండా ఆకర్షించే విషయమే. మరి ఇన్ని ప్లస్సులున్న ‘రెమో’ ఎలా ఉంది?? భామనే సత్యభామనే టైపు సినిమాలోని ప్లస్సులూ, మైనస్సులూ ఏంటి?? లెట్స్ గో..
* కథ
ఎస్కే (శివ కార్తికేయన్) సినిమా హీరో అవ్వాలని కలలుకంటుంటాడు. కావ్య (కీర్తి సురేష్)తో వన్ సైడ్ లవ్‌లో ఉంటాడు. ఓ సినిమా కోసం ఎస్.కెకి నర్సు పాత్ర వేయాల్సివస్తుంది. ఆ వేషంతో కావ్యకి మరింత దగ్గరవుతాడు. కావ్య కూడా ఎస్.కె.ని నిజంగా అమ్మాయే అనుకొంటుంది. తన ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కూడా ఇస్తుంది. గెటప్పులు మార్చీ.. మార్చి…. కావ్యకు కాస్త కాస్త దగ్గరైపోతుంటాడు. కావ్యకి ప్రపోజ్ చేసేలోగా.. ఆల్రెడీ తనకు నిశ్చితార్థం జరిగిపోయిందన్న నిజం తెలుస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది? తన ప్రేమని ఎస్.కె. ఎలా కాపాడుకొన్నాడు? నిశ్చితార్థం జరిగిన అమ్మాయి మనసు తన వైపుకు ఎలా తిప్పుకొన్నాడు? అనేదే రెమో కథ.
* నటీనటుల ప్రతిభ
ఈ సినిమాకి మూల స్థంభం… ఎస్కేగా, రెమోగా రెండు పాత్రల్లో కనిపించిన శివ కార్తికేయన్ అని చెప్పాల్సిందే. రెండు పాత్రల్లోనూ చక్కగా ఇమిడిపోయాడు. ఎస్.కె.గా ఎంత మేన్లీగా కనిపించాడో, రెమోగా ఆడవేషంలో అంత పొందిగ్గా ఒదిగిపోయాడు. చాలా చోట్ల శివ కార్తికేయన్ బాడీ లాంగ్వేజ్ నవ్విస్తుంది. సినిమాలో ఎంగేజ్డ్ పాయింట్.. అతని నటనే. నేను శైలజతో పోలిస్తే.. కీర్తి సురేష్ మరింత అందంగా కనిపించింది. హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అయితే కీర్తి నటన అప్పుడప్పుడూ కాస్త ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. వీరిద్దరితో పోలిస్తే.. మిగిలిన వారి హావభావాలూ… వాళ్ల డైలాగ్ డెలివరీ అస్సలు చూడలేము. రఘువరన్ బీటెక్‌లో ధనుష్ అమ్మ పాత్రలో చాలా డీసెంట్‌గా నటించిన శరణ్య.. ఈ సినిమాలో మాత్రం రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేయడం మింగుడు పడని విషయం.
* టెక్నికల్ టీమ్
ఇది టెక్నీషియన్ల సినిమా. అత్యంత సాధారమైన కథని సమర్థవంతమైన టెక్నీషియన్లు ఓ అందమైన దృశ్య కావ్యంగా మలుస్తారని చెప్పడానికి ఈ సినిమాని ఉదాహరణగా చూపించొచ్చు. పీసీ శ్రీరాం కెమెరా పనితనం గురించి చెప్పేదేముంది? ఈ సినిమాలో ఆయన విజృంభణ మరింతగా చూడొచ్చు. ప్రతీ సీన్‌నీ.. మళ్లీ మళ్లీ చూసేలా తీర్చిదిద్దారు. సీన్లో విషయం లేకపోయినా… ఆ కలర్ కాంబినేషన్ కోసమైనా చూసేయొచ్చు అనిపిస్తుంది. ఇక అనిరుథ్… తన నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేశాడు. పాటలూ ఓకే అనిపిస్తాయి. దర్శకుడు సాదా సీదా కథని ఎంచుకోవడం, ట్విస్టులూ.. టర్న్‌లూ లేకుండా చాలా క్యాజువల్‌గా ఈ సినిమాని నడిపించేయడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫ్లాట్ ఏ హీరోకి చెప్పినా ఒప్పుకోడు. దానికి గల కారణం.. ఇలాంటి కథలు చాలా చూసేయడమే. సెకండాఫ్‌లో ప్రేక్షకుల్ని బాగా విసిగించిన దర్శకుడు.. అక్కడి సన్నివేశాలకు కత్తెర వేయగలిగితే బాగుణ్ణు.
* తెలుగు 360 విశ్లేషణ
ఈ సినిమా చూసిన దిల్‌రాజు ఎందుకు ఎగిరి గంతేశాడో… ‘ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుంది.. నన్ను నమ్మండి’ అని ఎందుకు ఆ స్థాయిలో ప్రతిజ్ఞలు చేశాడో అర్థం కాదు. ఎందుకంటే.. తెలుగు సినిమా చూసీ చూసీ విసిగిపోయిన రొటీన్ పాయింట్ ఇది. నిశ్చితార్థం అయిన అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమని గెలిపించుకోవడం ఇలాంటి కాన్సెప్టులపై సర్వాధికారాలూ మన వెంకటేష్‌కే ఉన్నాయి. దాంతో పాటు హీరోలు ఆడవేషం వేసుకొని అమ్మాయికి దగ్గర కావాలనుకోవడం మేడమ్, చిత్రం భళారే విచిత్రం, భామనే సత్యభామనే లాంటి సినిమాల్లో చూసేశాం. వీటిలో కన్ఫ్యూజన్ కామెడీ, సిట్యుయేషన్ కామెడీ కనిపిస్తాయి. అవెప్పుడూ నవ్వించే అస్త్రాలే. అయితే `రెమో`లో మాత్రం అలాంటి సిట్యుయేషన్స్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ పెద్దగా కనిపించవు. అది పెద్ద మైనస్.
కథని ప్రారంభించిన విధానం.. పాత్రల పరిచయం ఆకట్టుకొంటాయి. కథానాయిక దగ్గర రెమోగా పరిచయం అవ్వడం, ఆసుపత్రి సన్నివేశాలు ఇవన్నీ సరదాగానే సాగుతాయి. ఫస్ట్ ఆఫ్‌లో కథేం పెద్దగా ఉండదు. కానీ.. చూడగలుగుతాం. దానికి కారణం.. అక్కడక్కడ నవ్వించే సన్నివేశాలు, కలర్‌ఫుల్ పిక్చరైజేషన్. హీరోగా శివ కార్తికేయన్‌ని ఒప్పుకోవడానికి తెలుగు ప్రేక్షకులకు కాస్త సమయం పడుతుంది. ఒకసారి.. ఆ ఫేస్ మైండ్‌లో ఫిక్స్ అయ్యాక… తను కూడా మన హీరోలానే అనిపిస్తాడు. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమ కథ మొదలవుతుంది. అవసరానికి మించి పాటలు వచ్చిపడిపోతుంటాయి. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా సాగేదే. ప్రీ క్లైమాక్స్‌లో భయంకరమైన ట్విస్టకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా కథనం చప్పగా అనిపిస్తుంది. విలన్ లేకపోవడం, హీరోకి ప్రేమని పొందడం మినహా పెద్దగా లక్ష్యాలు లేకపోవడం ఈ సినిమాకి ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. తమిళంలో బాగా పేలిన సంభాషణలు సైతం తెలుగులో సో.. సో.. గా అనిపిస్తాయి. అక్కడి ‘యాస’కీ ఇక్కడి ‘యాస’కీ తేడా అదే. శ్రీకాకుళం యాసలో పలికిన డైలాగుల్ని.. అలానే తమిళంలో తర్జుమా చేయలేం కదా? తమిళ భాషకీ ఓ యాస ఉంటుంది. ఆ యాసలో వినడమే హాయిగా ఉంటుంది. దాన్ని తెలుగీకరిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో.. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు వింటే అర్థమవుతుంది. కాస్త కామెడీ.. దానికంటే ఎక్కువైన అరవ కామెడీ.. పీసీ శ్రీరాం రంగుల హరివిల్లులా ఆవిష్కరించిన దృశ్యాలు.. కీర్తి సురేష్.. వీటి కోసమైతే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. అంతకు మించి ‘రెమో’ ఏం ఇవ్వలేడు కూడా.
తెలుగు360 రేటింగ్: 2.5