పెద్ద నోట్ల రద్దు ప్రభావం టాలీవుడ్‌పై విపరీతంగా పడింది. సెట్స్‌మీద ఉన్న కొన్ని సినిమాలు ఆగిపోయాయి. రిలీజ్లు వాయిదా పడ్డాయి. పారితోషికాలు వైట్‌లో ఇవ్వాలో, బ్లాక్‌లో ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకొంటున్నారు. నిర్మాతలు, బయ్యర్లు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడితో ఆగిపోవడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో.. రీషూట్లు కూడా చేసుకోవాల్సివస్తోంది. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం.. లక్కున్నోడు. ఈ సినిమా అంతా డబ్బుల వ్యవహారంతో నడిచేదే. సినిమాలో అక్కడక్కడ రూ.500, రూ.1000నోట్ల కట్టలు చూపిస్తారు. అవేమో రద్దయిపోయాయి. ఆ రద్దు నోట్ల కోసం హీరో పాట్లు పడుతుంటే.. జనం మరీ ఎటకారంగా నవ్వుతారు. ఆ స్థానంలో కొత్త నోట్లు చూపించాల్సిందే.
అందుకే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని రీషూట్ చేయాల్సివస్తోందట. లేదంటే సీజీలో మార్చుకోవాల్సివస్తోందట. ఈ పరిస్థితుల్లో షూటింగులే గగనమైపోయాయి. ఇక రీషూట్లంటే కష్టమే. మీలో ఎవరు కోటీశ్వరుడు, కిట్టుగాడుఉన్నాడు జాగ్రత్త సినిమాలకు ఇదే సమస్య వచ్చిందని తెలుస్తోంది. ఇవే కాదు.. నోట్లతో ముడిపడి ఉన్న సన్నివేశాలున్న ప్రతీ సినిమా… ఆయా సీన్లను మార్చుకోవడమే, ఎడిటింగ్ టేబుల్లో కట్ చేయడమో చేస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా సినిమాలకే పరిమితం కాలేదు. కొన్ని టీవీ సీరియళ్లకూ సేమ్ టూ సేమ్ ఇదే సమస్య వచ్చిందని, అవి కూడా రీషూట్లలో బిజీగా ఉన్నాయని సమాచారం.