2026 జనాభా లెక్కలు వచ్చే వరకూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం వచ్చింది. ఒకవేళ నియోజక వర్గాల సంఖ్య పెంచాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పదంటూ కూడా స్పష్టమైపోయింది! దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఫిరాయింపుదారులకు టెన్షన్ మొదలైందనే చెప్పాలి. ఎందుకుంటే, నియోజక వర్గాల సంఖ్య పెరుగుతాయన్న ఆశతోనే ఇతర పార్టీల నుంచీ తెరాస, టీడీపీలు ఫిరాయింపుల్ని ప్రోత్సహించాయి. ఈ ప్రకటన తరువాత తెలుగుదేశం నుంచీ ఎలాంటి స్పందనా లేదుగానీ, తెరాస నాయకులు మాత్రం స్పందిస్తున్నారు. టీజీ వెంకటేష్‌కు వచ్చిన సమాధానం రొటీన్ అనీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటూ కొత్త ఆశల్ని రేకెత్తించారు తెరాస ఎంపీ వినోద్ కుమార్.
విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుదల అంశం స్పష్టంగా ఉందనీ, పార్లమెంటు ఆమోదించింది కాబట్టి సీట్ల సంఖ్య పెరుగుతుందని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్టికల్-4 ప్రకారం విభజన జరిగింది కాబట్టి ఇతర రాజ్యాంగ సవరణలతో ప్రమేయం ఉండదన్నారు. ఒక చిన్న సవరణ చేస్తే సరిపోతుందనీ, దానికి మహా అయితే రెండు గంటల సభా సమయం సరిపోతుందని అన్నారు. హర్యానాలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి వచ్చినప్పుడు కేంద్రం చాలా సునాయాసంగా ఈ ప్రక్రియను పూర్తి చేసిందని వినోద్ గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదల విషయంలో కూడా మోడీ సర్కారు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టుగా వినోద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షల ప్రకారం సీట్లు పెరగాల్సి ఉందన్నారు!
అసెంబ్లీ సీట్లను పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారా..? తెలంగాణ కావాలని ప్రజలు కోరుకున్నారు… వచ్చింది. రాజధాని నిర్మాణం త్వరగా జరగాలని ఆంధ్రులు ఆశించారు… జరుగుతోంది! అంతేగానీ, అసెంబ్లీ సీట్లు పెరగాలనీ, జిల్లాల విభజన కావాలనీ, మండలాలు కావాలనీ, గ్రామ పంచాయతీలు మార్చాలనీ ప్రజలకు డిమాండ్ చేశారా..? అయినా, నియోజక వర్గాల సంఖ్య పెరగడం అనేది రాజకీయ పార్టీలకు అవసరం. ఎన్ని నియోజక వర్గాలుంటే అంతమంది నాయకులు తయారౌతారు. రాజకీయ ఉపాధి హమీ కల్పనకు బాగుంటుంది. ఒకవేళ ప్రజలే సీట్ల పెంపుదలను కోరుకుంటే… ఇప్పట్లో అది కుదిరేపని కాదని కేంద్రం ప్రకటించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఎవరైనా స్పందించాలి కదా! రాజకీయ పార్టీల అవసరాలను కూడా ప్రజలమీదికి నెట్టేస్తే ఎలా..?