ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు… ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా వేస్తున్న ప్రశ్న ఇదే. నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు చేశారు. నిర్ణయం మంచిదే, కానీ అమలు తీరుతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల ముందు డబ్బు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటుకు రాకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రముఖ ఎకానమిస్టులు, రాజకీయ విశ్లేషకులు, ఇతర రంగాల ప్రముఖులు చాలామంది ఈ నిర్ణయం అమలులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. అయితే, ఈ పరిస్థితిపై కూడా మోడీ స్పందించడం లేదు! ఇలాంటి సందర్భంలోనైనా ఆర్థికవేత్తలతో మోడీ ఎందుకు సమావేశం కావడం లేదు..? వివిధ రంగా ప్రముఖుల సలహాలు ఎందుకు తీసుకోవడం లేదు..? ప్రజల అవస్థల్ని ఎప్పటికి తీరుస్తారో స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు..? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ప్రశ్నలన్నింటికీ తనదైన శైలిలో ఓ సమాధానం చెప్పారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. నల్లధనం దేశానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి అని వెంకయ్య అన్నారు. ఆ క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేసే పనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారన్నారు! నల్లధనంపై ఆయన యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయం వల్ల నల్లధనవంతులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. మొన్నటికి మొన్న… ఇదో ప్రసవ వేదన అని ప్రజల ఇబ్బందుల్ని పోల్చారు! ఇవాళ్లేమో… ప్రజలు స్వాగతిస్తున్నారని అంటున్నారు.
మొత్తానికి భాజపా నేతలందరూ ప్రజల ఇబ్బందుల్ని ప్రస్థావిస్తూనే… ‘స్వాగతిస్తున్నారు’ అనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను ప్రజలమీద రుద్దేస్తున్నారు! ప్రజల అవస్థల్ని ప్రతిపక్షాలు ప్రస్థావిస్తే… అది వారి రాజకీయం అని వ్యాఖ్యానిస్తున్నారు. వంద కోట్లకు మించిన జనాభా ఉన్న దేశంలో కేవలం 5 లక్షలమంది అభిప్రాయం తీసుకుని, 98 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఓ సర్వేను ప్రచారంలోకి తెస్తున్నారు. అంటే… ‘అందరూ బాగానే ఉందంటున్నారు. నా ఒక్కడికే ఇబ్బంది అని చెబితే బాగోదేమో’ అని సామాన్యుడు తనకు తాను సర్దిచెప్పుకునే ఓ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భాజపా బాగానే ప్రయత్నిస్తోంది. అయితే, వాస్తవాలు వాస్తవాలే! ఈ కరెన్సీ కష్టాలు పోవాలంటే కనీసం మరో మూడు నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి, ఈ మూడు నెలలూ ప్రజల ఇష్టపూర్వకంగానే ఇబ్బందులు పడటానికి సిద్ధంగా ఉన్నట్టు భాజపా ఫిక్స్ చేసింది!