మెయిన్‌స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఏదో ఒక పార్టీకి, కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, మతాలకు అనుకూలంగా ఉంటున్న దిగజారుడు పరిస్థితుల నేపథ్యంలో వెబ్‌సైట్స్‌తో పాటు, సోషల్ మీడియా కూడా పాపులర్ అవడం సమాజానికి మంచే చేసింది. రాజకీయ నాయకుల నిజస్వరూపాలు, నిజమైన సినిమా ఫలితాలు, సినిమా వాళ్ళ అసలు రంగులు ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి. నిజాలను దాచిపెట్టడమో, వక్రీకరించడమో సాధ్యం కాని పరిస్థితుల్లో మనముండటం గొప్ప విషయం. అయితే ఈ న్యూ ట్రెండ్ మీడియాలో కూడా జనాల ఎమోషన్స్‌తో ఆడుకునేవాళ్ళు భారీ సంఖ్యలోనే ఉన్నారు. పార్టీ, కులం, ప్రాంతం, మతంలాంటి వాటిని జనాలందరూ గుడ్డిగా అభిమానించేలా చేయాలనే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు లాభపడుతున్నారు. ప్రజలను మాత్రం అమాయకులను చేసి రచ్చబండ స్థాయి చర్చల రచ్చలకు పురిగొల్పుతున్నారు.
మోడీ, చంద్రబాబు, జగన్, కెసీర్, పవన్ అంటూ వ్యక్తుల ప్రస్తావన వచ్చినప్పుడు భజన షురూ చేయడం ఒకె కానీ అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా, నోట్ల రద్దులాంటి విషయాల గురించి చర్చించేటప్పుడు అయినా కాస్త భజన కార్యక్రమం పక్కనెట్టి మన సొంత ఆలోచనలు వాడితే మన ఆలోచనల స్థాయి పెరుగుతుంది. మనకే మంచిది. ఇప్పుడు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, రామ్ చరణ్‌ల ‘ధృవ’ సినిమాల గురించి కూడా రచ్చ మొదలైపోయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా హిట్టా? ఫట్టా? బాగుందా? బాగాలేదా? థియేటర్స్ ఎన్ని? కలెక్షన్స్ ఎంత? అంటూ ఇంతకుముందు కూడా చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్..ఇలా అన్ని విషయాల్లోనూ పోలికలే. మావోడి సినిమా ట్రైలర్ ఇన్ని లక్షల మందికి నచ్చింది అని చెప్పుకోవడమన్నా రికార్డ్ అవుతుందేమో కానీ ఎంతమంది చూశారు అనే విషయం కూడా ఎలా రికార్డ్ అయిపోతుందో తెలియడం లేదు. నెట్ డేటా ఉండి, తెలుగు సినిమాలపైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతివాడు టాప్ రేంజ్ సినిమాల ట్రైలర్స్‌ని ఎలాగూ చూస్తాడు. మా హీరో సినిమాకి కనీసం ఈ రికార్డ్ అన్నా తెచ్చిపెడదాం అని పీలవుతారో ఏమో తెలియదు కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం తమ పనులు మానుకుని మరీ ఒకటికి పదిసార్లు చూసేస్తూ ఉంటారు. కొంతమంది అదేపనిగా చూస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు.
చూడడం వరకూ ఫర్వాలేదు కానీ సాటి హీరోల సినిమాలతో పోలుస్తూ తమ దిగుస్థాయి వల్గర్ భాషా ప్రావీణ్యాన్ని చూపిస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఈ ట్రెండ్‌ని భయంకరంగా ఎంకరేజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చరణ్ ధృవ, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలను అలాగే పోల్చుతూ తిట్టుకుంటూ ఉన్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఫ్రెండ్స్ అన్న విషయం వీళ్ళకు అస్సలు తెలియదు. తెలిసినా ఒఫ్పుకోరు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా స్నేహం గురించి మాట్లాడుతూనే ఉంటారు కానీ ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య మాత్రం తరచుగా కలుసుకుంటూ ఉండేంత స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అభిమానులు మాత్రం తిట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఆ అభిమానుల ఎమోషన్స్‌కి పెట్రోల్ పోసి తాము చలిమంట కాచుకుంటూ(క్యాష్ చేసుకుంటూ) బ్రతుకుతున్న జనాలు సోషల్ మీడియాలో చాలా మందే ఉన్నారు. పదుల సంఖ్యలో వెబ్‌సైట్స్ ఉన్నాయి. సంస్కారాన్ని వదిలేసి, ఉచ్ఛనీచాలు తెలియకుండా మనం వాడే భాష మనల్ని, మన చుట్టూ ఉన్నవాళ్ళను బాధపెడుతుందన్న కనీస కామన్సెన్స్ కూడా వీళ్ళకు ఉండదు.
ఇప్పుడు ధృవతో స్టార్ట్ అయింది. రేపు ఖైదీ వర్సెస్ గౌతమీ రచ్చ ఉంది. మన చుట్టూ, మనతోనే ఉన్న మూఢ భక్తులు ఏ రేంజ్లో రెచ్చిపోతారో? ఎంత విషాన్ని చిమ్ముతారో చూడాలి మరి. ఎవ్వరినీ, ఏ విషయాన్ని కూడా గుడ్డిగా అభిమానించాల్సిన బానిసత్వం మనకు అవసరం లేదు. మనకు కనీస పరిచయం కూడా లేని ఎవరో గొప్పతనాన్ని నిలబెట్టడం కోసం మనం దిగజారాల్సిన అవసరం అయితే అస్సలు లేదు.