బోయపాటి శ్రీను భలే మ్యాజిక్ చేస్తుంటాడు. అప్పటి వరకూ ఖాళీగా ఉన్నవాళ్ల ఫేట్‌ని ఒక్కసారిగా మార్చేస్తుంటాడు. ఇక ఆయా నటులకు పండగే… పండగ. దమ్ము సినిమా కి ముందే.. తొట్టెంపూడి వేణుని అంతా మర్చిపోయారు. ఆ సినిమాకి ఎన్టీఆర్ బావ పాత్ర కోసం వేణుకి తీసుకొచ్చారు. అసలే సినిమాల్లేవు, ఆపైన సైడ్ క్యారెక్టర్. వేణుకి ఎంతిచ్చుంటారో ఊహించండి.. మహా అయితే నాలుగైదు లక్షలు ఇచ్చుంటారు అనుకొంటున్నారా? అయితే మీరు షాక్ తినాల్సిందే. ఆ సినిమా కోసం వేణుకి రూ.70 లక్షల వరకూ ముట్టాయి. కట్ చేస్తే… లెజెండ్‌లో జగపతిబాబు విలన్ అయ్యాడు. నాలుగైదు సినిమాల్లో హీరోగా చేస్తే సంపాదించలేనంత ఆ ఒక్క సినిమాతో పారితోషికంగా అందుకొన్నాడు జగ్గూభాయ్. సరైనోడుతో ఆది పినిశెట్టి కూడా అంతే. ఇప్పుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సినిమాతోనూ ఒకరికి లైఫ్ ఇవ్వబోతున్నాడు బోయపాటి. అతనే శరత్ కుమార్.
సాయికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు శరత్ కుమార్. తమిళంలో శరత్ కుమార్ సినిమలేం చేయడం లేదు. ఆ పెద్దాయన్ని పట్టించుకొనేవారూ లేరు. అలాంటి నటుడ్ని పట్టుకొచ్చాడు ఈ సినిమా కోసం. ఏకంగా 65 రోజుల కాల్షీట్లు తీసుకొన్నారు. ఒక్కో కాల్షీటుకీ రూ.3 లక్షల పారితోషికం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆ లెక్కన దాదాపుగా రూ.2 కోట్లు ఆయనకే ఇచ్చేస్తున్నారన్నమాట. ఈ సినిమాలో మరో కథానాయకుడూ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. ఆయనకు ఎంతిస్తారో మరి…?! ఆల్రెడీ కథానాయిక రకుల్ ప్రీత్‌కి రూ.1 కోటి వరకూ ముట్టజెప్పారు. బోయపాటి శ్రీను రూ.12 కోట్ల వరకూ పారితోషికం అందుకొన్నాడట. ఇలా… పారితోషికాలకే రూ.25 కోట్లు అయ్యేలా ఉంది. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ సాగుతోంది. త్వరలో విశాఖపట్నం ఫిఫ్ట్ కానుంది చిత్రబృందం.