పెళ్లిచూపులు సినిమా మన దర్శకుల, నిర్మాతల ఆలోచనా ధోరణిని బాగా మార్చింది. సెన్సిబుల్ కథల్ని ఎంచుకొనేందుకు సరిపడా ధైర్యాన్ని కలిగించింది. కొత్తవాళ్లతో, తక్కువ పెట్టుబడితో సినిమాలు తీసినా, అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపించింది. అందుకే… పెళ్లి చూపులు తరవాత చిన్న సినిమాలు, కొత్త ఆలోచనలతో రూపుదిద్దుకోవడం ఎక్కువైంది. పిట్ట గోడ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే అనిపిస్తోంది. ఉయ్యాల జంపాల లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన రామ్ మోహన్ పి. ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. దాంతోపాటు.. డి.సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం, ఆకట్టుకొనే టైటిల్ ఈ సినిమాపై ఫోకస్ పెంచాయి. ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై హోప్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఓ ఊరు.. అక్కడో పిట్టగోడ. ఆ గోడపై నలుగురు కుర్రాళ్లు. వాళ్ల ఆలోచనలు, అల్లర్లు… వీటి మధ్య ఓ అమ్మాయి.. ఇదీ స్థూలంగా పిట్టగోడ కథ. చిరంజీవి – వంశీ కాంబినేషన్లో వచ్చిన మంచు పల్లకి సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో సాగిన సినిమా. కాకపోతే… ఈ సినిమా ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టే కనిపిస్తోంది. పల్లెటూరు నేపథ్యం, అందునా తెలంగాణ మాండలికం, పచ్చని ప్రేమకథ.. ఈ పిట్టగోడని యూత్‌ని దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయి. డి.సురేష్ బాబు చిన్న సినిమాని పెద్ద సినిమాగా మార్చడం తెలిసిన వ్యక్తి. పెళ్లి చూపులతో అదే మ్యాజిక్ చేశారు. ఇప్పుడు కూడా.. సేమ్ టూ సేమ్ ఆ హిట్‌ని రిపీట్ చేయబోతున్నారేమో..? ఫ్రెష్ లుక్‌తో సాగిన టీజర్.. థియేటర్ వైపుకు అడుగులు వేసేలా చేస్తోంది. మరి ఆ అడుగులు ఎంత బలంగా పడ్డాయో తెలియాలంటే రిలీజ్ డేట్ వరకూ ఆగాల్సిందే.