ఓవర్సీస్ మార్కెట్ టాలీవుడ్ వసూళ్లలో కీలక భాగం ఆక్రమించేసింది. అక్కడో సినిమా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. స్టార్ హీరోలంతా ఓవర్సీస్ దుమ్ము దులిపిన వాళ్లే. నాని కూడా ఓవర్సీస్లో కోట్లు తెచ్చుకొంటున్నాడు. అయితే రామ్ చరణ్‌కి మాత్రం అక్కడ ఏమాత్రం కలసి రాలేదు. టాలీవుడ్లో హిట్ సినిమాలు అనిపించుకొన్న నాయక్, ఎవడు లాంటి చిత్రాలు కూడా ఓవర్సీస్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే చరణ్ సినిమాలేవీ వన్ మిలియన్ మార్క్ ని అందుకోలేదు. ఈసారి ధృవతో ఆ లోటు తీర్చుకొందామని ప్రయత్నిస్తున్నాడు చరణ్. రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. డిసెంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ధృవపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. పైగా ఇలాంటి స్టైలీష్ చిత్రాలు, కాన్సెప్ట్ కథలకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ధృవ కూడా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కి దగ్గరగా తీర్చిదిద్దారు. అందుకే ధృవ ఓవర్సీస్లో దుమ్ముదులపడం ఖాయమని చరణ్‌తో పాటు చిత్రబృందం ఆశలు పెట్టుకొంది.
అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోవడం చరణ్‌కి ఇష్టం లేదు. అందుకే ఈసారి ఓవర్సీస్లో భారీ ప్రమోషన్లు జరపాలని నిర్ణయించుకొన్నాడట. విడుదల ముందు రోజు అక్కడకు వెళ్లి.. ఫ్యాన్స్ మధ్య షో చూడాలని చరణ్ భావిస్తున్నాడని తెలుస్తోంది. డిసెంబరు 8న ఓవర్సీస్లో ధృవ ప్రీమియర్స్ భారీ ఎత్తున పడబోతున్నాయి. ఆ సమయానికి చరణ్ అక్కడే ఉండి అకాశాలున్నాయని తెలుస్తోంది. ధృవ దూకుడు, చరణ్ ప్లానింగ్ చూస్తుంటే.. ఈసారి ఓవర్సీస్లో చరణ్ తన లక్ష్యాన్ని చేరుకొంటాడనే అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.