కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలుగుదేశం రెండు రకాలుగా డీల్ చేస్తోంది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. దేశంలో అవినీతి అంతానికి ఇది పునాది అంటున్నారు. కొద్ది రోజులు ఇబ్బందులు ఉన్నా అంతిమంగా సామాన్యులు లాభపడతారని చెబుతున్నారు. అయితే, అదే పార్టీకి చెందిన ఇతర నాయకుల ధోరణి మాత్రం ఇంకోలా ఉంది! పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటు చర్యగా ఇతర టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులే అత్యధికంగా ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. కేవలం ఓ 20 మంది బడాబాబుల దగ్గరున్న నల్లధనాన్ని అరికట్టడం కోసం ఏకంగా 80 మంది సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టేశారని చెప్పారు. భాజపా సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదైనప్పటికీ, అమలు తీరు సరిగా లేకపోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ అవస్థల్ని కేంద్రం గ్రహించాలనీ, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కోడెల అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన చిన్ననోట్లను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప సామాన్యుల కష్టాలు తీరవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్దిరోజుల కిందట తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ కూడా కేంద్రం తీరుపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబం ఉన్నవారికే నోట్ల కష్టాలు తెలుస్తాయంటూ ప్రధానమంత్రి మీదే సెటైర్ వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు! ఇక్కడ గమనించాల్సి ఏంటంటే… మంత్రులూ ఇతర నాయకులు మాత్రమే కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ప్రజల కష్టాలను అడ్రస్ చేస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల కష్టాలు కొద్ది రోజులే ఉంటాయనీ, అవినీతి అంతమైపోయిందన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అంటే, భాజపాతో దోస్తీ చెడకూడదు. అలాగని, ప్రజల నుంచీ తెలుగుదేశంపై విమర్శలు ఎదురుకాకూడదు! భాజపా నిర్ణయం గొప్పదని అంటూనే… ఇతర నాయకులతో అదే నిర్ణయంపై విమర్శలు చేయిస్తున్నారు. అంటే, వ్రతం చెడినా ఫలితం చెడకూడదన్నమాట! నిజానికి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తానే మోడీకి ఉత్తరం రాశానని గతంలో చెప్పుకున్నారు కదా! ఎప్పుడైతే సామాన్యుడి కష్టాలు పెరిగిపోయాయో… మధ్యలో మనకే బ్యాండ్ పడేట్టుందని అనుకుని వ్యూహం మార్చేశారు. అలాగని భాజపాపై ఆయన విమర్శలు చేయడం లేదు! ప్రజల పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే.. తెలుగుదేశం నాయకులు కూడా కేంద్రాన్ని తప్పుబడుతున్నారనే ఫీల్ కలిగిస్తున్నారు! చంద్రబాబుది స్వామి కార్యం.. మంత్రులూ ఇతర నేతలకు స్వకార్యం!