ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్ కోసం “ఫ్లాష్ టీమ్” జరిపిన సర్వే ఫలితాలు రాష్ట్రంలోని రాజకీయ వర్గాలలో ఏమాత్రం ఆసక్తి కలిగించడం లేదు. “సర్వే ఫలితాలు అంతకన్నా వేరుగా ఉంటాయని ఏవిధంగా అనుకుంటాం” అని ప్రతిపక్ష నాయకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు దేశం వర్గాలు సహితం ఈ సర్వే ఫలితాలను తీవ్రంగా పరిగణించడం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంభం సభ్యులు కొద్దీ నెలల క్రితం చేయించిన సర్వే ఫలితాలు, ప్రభుత్వ నిఘా విభాగం అంచనాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుగు దేశంకు అంత అనుకూలంగా ఉన్నట్లు చెప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షణలో ఈ సర్వే జరిగి ఉండవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటె ఆయన ఆధ్వర్యంలోనే తరచుగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు గురించి, వివిధ ప్రభుత్వ పధకాల పట్ల ప్రజల స్పందన గురించి పలు సర్వేలు జరిపిస్తున్నారు.
తెలుగు దేశం కు చెందిన వర్గాల కధనం ప్రకారం ఈ సర్వే ఫలితాలను టివిలో ప్రసారం చేయడానికి మూడు రోజుల ముందు ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కలసి మంతనాలు జరిపారు. ఈ సర్వే అంశాల గురించే వారు చర్చించి ఉండే అవకాశం ఉన్నదని వారి భావిస్తున్నారు.
“ఫ్లాష్ టీమ్” సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు దేశం -బిజెపి కూటమి ప్రస్తుతం కన్నా ఎక్కువ సంఖ్యలో (120) సీట్లు గెలుపొందుతాయి. ప్రతిపక్షం వై యస్ ఆర్ కాంగ్రెస్ బలం తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ జన సేన ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మరో వంక ప్రజలు తెలుగు దేశం – బిజెపి కూటమి సంశయంతో చూస్తున్నారు. తెలుగు దేశం ఒంటరిగా పోటీచేస్తే 140 సీట్లు గెలుపొందుతుంది.
అయితే ముఖ్యమంత్రి చేయించుకున్న అంతర్గత సర్వే, తన నిఘా విభాగం సమాచారం మేరకు రాష్ట్రంలో గల 175 నియోజక వర్గాలు ఉండగా కేవలం 56 నియోజక వర్గాలలోని ప్రభుత్వం పట్ల ప్రజలు ` సంతృప్తి’ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యే అత్యధికుల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
రెండు నెలల క్రితం విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఓటమిచెందిన నియోజక వర్గాలలోని పార్టీ ఇన్ ఛార్జ్ లతో జరిపిన రెండు రోజుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరికి ఆయన స్వయంగా సీల్ చేసిన కవర్లు ఇచ్చారు. ఆ కవర్లు వారి `ప్రగతి నివేదిక’ అని కధనాలు వచ్చాయి. వాటిల్లోని వివరాలను ఎవ్వరికీ చెప్పవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించటం గమనార్హం. దాదాపుగా అందరి పనితీరు అధ్వాన్నంగా ఉండటం కారణంగానే ఈ హెచ్చరిక చేశారని ఒక మాజీ మంత్రి పేర్కొన్నారు.