కాటమ రాయుడు సినిమాని చుట్టేస్తున్నారు.. క్వాలిటీ లేదు.. డబ్బులు ఖర్చు పెట్టడం లేదు.. లబ్ లబ్ లబ్ లబ్ అంటూ ఏవేవే పుకార్లు వినిపిస్తున్నాయి. సర్దార్ – గబ్బర్‌సింగ్‌తో శరత్ మరార్, పవన్ కల్యాణ్ జేబులు నింపుకొన్నా – ఆ సినిమాని భారీ రేట్లకు కొన్న బయ్యర్లు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. వాళ్లందరినీ ఒడ్డున పడేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాటమరాయుడుపై ఉంది. సర్దార్ సినిమా కొని నష్టపోయిన బయ్యర్లకు ఈ సినిమాని తక్కువ రేటుకి అమ్మి.. వాళ్లని ఆదుకోవాలని పవన్ భావిస్తున్నాడు. తక్కువ రేటుకి అమ్మాలంటే సినిమాని తక్కువలో తీయాలి. దాన్ని బేస్ చేసుకొనే ఇలాంటి రాతలు పుట్టుకొచ్చాయేమో. ఈ పుకార్లపై స్పందించడానికి టీమ్ లో ఎవ్వరూ సిద్దంగా లేకపోయినా.. పవన్ సన్నిహితులు మాత్రం ఈ విషయంపై కావల్సినంత క్లారిటీ ఇస్తున్నారు. ”సినిమాని వేగంగా తీస్తున్నాం. చుట్టడం లేదు. కాటమరాయుడుని డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది మా ప్లాన్. సినిమా కొబ్బరికాయ్ కొట్టేటప్పుడే ఆ డేట్ ఫిక్సయ్యింది. మధ్యలో పవన్ పొలిటికల్ ఎంట్రీ, సభలూ సమావేశాల వల్ల చిత్రీకరణలో జాప్యం జరిగింది. ఆ ప్రభావం పడకుండా ఉండాలని రాత్రిం బవళ్లూ షూటింగ్ చేస్తున్నాం” అంటున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు.
పవన్‌కి అసలే సినిమాలు, షూటింగులు, నటన అంటే కాస్త బోర్ కొట్టింది. షూటింగులకు అందుబాటులో ఉండేదే చాలా తక్కువ. వీలైతే.. సినిమాల్ని వాయిదా వేసే టైపు. అలాంటి పవన్ కాస్త మూడ్ తెచ్చుకొని సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందుకొచ్చాడు. అది అభినందించాల్సిన విషయం. చిత్ర బృందం కూడా ఇదే విషయమై సంబర పడుతోంది. పవన్ చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ. మరోవైపు త్రివిక్రమ్ సినిమా, నేసన్ సినిమాలు లిస్టులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చాలంటే పవన్ స్పీడు పెంచాల్సిందే. ప్రస్తుతం అదే చేస్తున్నాడు. దానికి ‘చుట్టేస్తున్నారంటూ’ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇది స్పీడో.. చుట్టేయడమో సినిమా వస్తేగానీ అర్థం కాదు.