2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ విజయంలో నిర్ణయాత్మక పాత్ర వహించిన కాపు ఓట్లలో చీలిక తీసుకు రావడం ద్వారా 2019 ఎన్నికలలో రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రతిపక్ష నాయకుడు వై యస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొనవలసి రావడంతో ఇప్పుడు వ్యూహాత్మకంగా పలువురు ప్రముఖుల ద్వారా పద్మనాభంను, తద్వారా కాపు ఉద్యమాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గతవారం ప్రముఖ చలన చిత్ర నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డా. యం మోహన్ బాబు ప్రత్యేకంగా కిర్లంపూడి వెళ్లి పద్మనాభంను కలసి రావడం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. దశాబ్ధకాలంకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోహన్ బాబు గత ఎన్నికలలో తెలుగు దేశం పార్టీలో చేరాలని, కుమార్తె లక్ష్మి ని పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ఎన్నో వత్తిడులు వచ్చినా సంయమనంతో వ్యవహరించారు. పైగా ఆయనకు జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో ఇప్పుడు సన్నిహిత బంధుత్వం ఏర్పడటంతో ప్రతిపక్ష దూతగానే పద్మనాభంను కలసి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.
మరోవంక, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు మొదటినుండి ఈ విషయంలో ముద్రగడకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కొద్దీ నెలల క్రితం ప్రత్యేకంగా హైదరాబాద్ లో నారాయణరావు ఇంటికి వెళ్లి తమ పార్టీలో చేరమని ఆహ్వానించారు. తరువాతి కాలంలో రాజ్య సభ సీట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చిన్నట్లు వినబడుతున్నది. అయితే ఆయన వై వై అస్ ఆర్ కాంగ్రెస్ లో చేరే విషయంపై ఇంతవరకు స్పందించక పోయినా కాంగ్రెస్ పార్టీ కి దూరంగా ఉంటున్నారు. దానితో ఆయన కూడా ముద్రగడ-జగన్మోహన్ రెడ్డి ల మధ్య సంధాన కర్తగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.
ఇంకోవైపు, తమిళ్ నాడు మాజీ గవర్నర్ కె రోశయ్య సహితం పద్మనాభం ను కలసి “పాత మిత్రుడిని” కలవడానికి వచ్చానని చెప్పారు. అదే సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ని కూడా కలసి “మంచి స్నేహితుడి కుమారుడిని” కలుస్తున్నట్లు తెలిపారు. ఆయన మాటలు సహితం నర్మగర్భంగా ఉన్నాయి.
ఈ పరిణామాలు సహజంగానే తెలుగు దేశం వర్గాలలో కలవరం కలిగిస్తున్నాయి. గత ఎన్నికలలో, ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో పూర్తి విజయం సాధించడం, గుంటూరు వంటి జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించడం కాపుల మద్దతుతోనే కావడం గమనార్హం. ఈ ఓటర్లలో ఏమాత్రం చీలిక వచ్చినా రాజకీయంగా చాలా నష్ట పోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మొదటి నుండి ముద్రగడ ఉద్యమాన్ని జగన్ నడిపిస్తున్నారని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు.