తెలంగాణ రాజకీయ కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ యం కోదండరాం కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది. కె చంద్రరాశేఖర రావు ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తితో ఏర్పడే రాజకీయ సూన్యతను ఆసరా చేసుకొని 2019 ఎన్నికల రాజకీయ శక్తిగా ఎదగడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది.
ఈ మధ్య వరకు రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనంతో వ్యవహరిస్తూ కేవలం అభివృద్ధి కి సంబంధించిన అంశాలకే అయన పరిమితం అవుతున్నారు. అయితే ఇటీవల నేరుగా చంద్రశేఖర రావు ప్రభుత్వంపై దాడులు చేయడం ప్రారంభించారు. తాజాగా ముఖ్యమంత్రి అధికారం నివాసం అంటూ రాజ్ మహల్ ను తలపించే రీతిలో చంద్రశేఖర రావు భవనాలు నిర్మించు కోవడం ప్రజాధనాన్ని వృద్ధ చేయడమే అని నేరుగా ఆయనపై దాడికి పాల్పడ్డారు.
ఈ మధ్యనే నిర్మించిన ముఖ్యమంత్రి అధికార నివాసం ఉండగా మరో భవనం ఎందుకని ప్రశ్నించారు. అవసరం అనుకొంటే ఉన్న భవనానికి తగు మరమత్తులు చేయించుకోవచ్చు గదా అని అన్నారు. పేదలు, రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం లేదని ఈ విధంగా ప్రజాధనాన్ని వృద్ధ చేయడం వెల్లడి చేస్తున్నదని నిశితంగా విమర్శించారు.
ఒక సంవత్సరం లోపుగానే ఇంతటి అందమైన భవనాన్ని ఘనంగా నిర్మించిన ప్రభుత్వం పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం అక్కడే జరిపి ఉంటె ఎంతో ఘనంగా ఉండెడిది అని ఆయన పేర్కొన్నారు. మరో వంక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచిన పలువురు వామపక్ష భావాలు గల వర్గాలు సహితం ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయమని కోదండరాం పై వత్తిడి తీసుకు వస్తున్నాయి.
మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు వంటి వివిధ వర్గాల ప్రజలతో పనిచేస్తున్న ప్రజా సంఘాల మద్దతు తనకు ప్రారంభించే పార్టీకి ఉండగలదని కోదండ రామ్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం కోసం కొద్దీ కాలం క్రితం జెఏసి నియమించిన కమిటీ తయారు చేసే నివేదిక్ కొత్త పార్టీకి ఎన్నికల ప్రణాళికగా ఉపయోగ పడగలదని భావిస్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణలో విస్తృతమైన పలుకుబడి గల వామపక్షాలు ఇప్పుడు చతికల పడి, ప్రజలను ఆకట్టుకోవడానికి సుపరిచితమైన `ముఖం’ లేక ఇప్పుడు నీరస పడుతున్నారు. వామపక్ష వర్గాలు ఎదుర్కొనే ఈ నాయకత్వ సూన్యతను కోదండ రామ్ పూర్తి చేయగలరని ఆయన మద్దతు దారులు అంచనా వేస్తున్నారు.