రీమేక్ కథలంటే మనకెంత ఇష్టమో..? కొత్తగా కథ గురించి ఆలోచించక్కర్లెద్దు. కట్ పేస్ట్ రెండూ తెలిస్తే సరిపోతుంది. రీమేక్ కథల్ని ఈజీగా తెరపైకి అచ్చుగుద్దినట్టు దింపేయొచ్చు. అందుకే పక్క భాషలో ఆడిన యావరేజ్ సినిమాలకూ భలే గిరాకీ ఏర్పడిపోతుంటుంది. టాలీవుడ్‌కి రీమేక్ కథలేం కొత్తవి కావు. ప్రతీ సీజన్లోనూ అలాంటి ఓ అరడజను సినిమాలు సిద్దమైపోతుంటాయి. త్వరలోనే టాలీవుడ్‌కి మరో రీమేక్ రాబోతోంది. అదీ.. బాలీవుడ్ నుంచి. విద్యాబాలన్ నటించిన కహానీ 2 చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావాలని ఓ అగ్ర నిర్మాత అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టేశారు. విద్యాబాలన్ నటించిన చిత్రమిది. బాక్సాఫీసు దగ్గర భారీ ప్రకంపననాలు ఏం సృష్టించకపోయినా.. కహానీ 2 రిజల్ట్ డీసెంట్‌గానే ఉంది. పైగా తక్కువ బడ్జెట్‌తో చేసుకోవొచ్చు. అందుకే.. ఈ సినిమాని రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ నిర్మాత ముంబై పయనమయినట్టు, రేపో.. మాపో కహానీ 2 నిర్మాతతో భేటీ వేస్తున్నట్టు తెలుస్తోంది.
కహానీ తెలుగులో అనామిక పేరుతో విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిశార పరిచింది. దాంతో.. కహానీ 2 వస్తుందని తెలిసినా.. మనవాళ్లు పెద్దగా ఎలెర్ట్ కాలేదు. ఈసారి కహానీ 2 రీమేక్ రైట్స్ కాస్త తక్కువకే దొరికే అవకాశం ఉండడంతో మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కహానీ 2 రైట్స్ తీసుకొన్నా.. విద్యాబాలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో..? నయనతారని తెలుగువాళ్లు భరించడం కష్టం. అనుష్క సినిమాల్ని తగ్గించుకొంటూ వెళ్తోంది. పైగా విద్యాబాలన్ పాత్ర అనుష్కకి సూట్ అయ్యే ఛాన్స్ లేదు. కహానీ 2 రీమేక్ రైట్స్ దక్కించుకోవడం కంటే విద్యాబాలన్ పాత్ర ఎవరితో చేయించుకోవాలో నిర్ణయించుకోవడమే కష్టంగా మారింది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.