ఓ హిట్టు కొడితే చాలు.. కొత్త దర్శకులకు స్టార్ హీరోతో సినిమా చేయడానికి ద్వారాలు తెరచుకొన్నట్టే. ‘నాకు సరిపడా కథలున్నాయా’ అంటూ పెద్ద హీరోలు కర్చీఫ్‌లు వేయడం మొదలెట్టేస్తారు. ఇప్పుడు వాళ్లందరి దృష్టి వి.ఐ ఆనంద్‌పై పడింది. టైగర్ తో తనని తాను ప్రూవ్ చేసుకొన్నాడు ఆనంద్. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడాతో మంచి కమర్షియల్ హిట్ అందుకొన్నాడు. ఈ సినిమా దాదాపుగా రూ.20 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం కలక్షన్లు ఆ మైలు రాయికి దగ్గరలో ఉన్నాయి. దాంతో… ఆనంద్‌పై దృష్టి పెట్టారు హీరోలు, నిర్మాతలు. అల్లు శిరీష్ తో ఆనంద్ ఓ సినిమా చేయనున్నాడట. ఆ తరవాత… ఆనంద్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఆనంద్.. బన్నీకి వీర ఫ్యాన్ అని తెలిసింది. టైగర్ సమయంలోనే బన్నీ కోసం ఓ కథ రెడీ చేశాడు. అయితే దాన్ని అప్పుడు వినిపించే అవకాశం రాలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా తరవాత బన్నీని కలసి లైన్ చెప్పాడట. అది… బన్నీకి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇదో సైన్స్ ఫిక్షన్ అని సమాచారం. అయితే అల్లు శిరీష్ కి ఆనంద్ ఓ హిట్ ఇవ్వాల్సివుంది. శిరీష్‌తో చేస్తున్న సినిమా హిట్ అయితే… తప్పకుండా బన్నీ ఛాన్స్ ఇచ్చేస్తాడు. అందుకే ప్రస్తుతం శిరీష్ సినిమాపై దృష్టి పెట్టాడు ఆనంద్. ఇదో లవ్ స్టోరీ అని.. అయితే దాన్ని ఓ డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. స్వామి రారా నిర్మాత చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.